జార్ఘండ్ సీఎంపై అనర్హత వేటు పడుతుందా..?

జార్ఘండ్ సీఎంపై అనర్హత వేటు పడుతుందా..?

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు  పదవీ గండం ఏర్పడింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో  సీఎం హేమంత్ సోరెన్ హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో..ఆయనపై అనర్హత వేటు కోసం ఎన్నికల సంఘం గవర్నర్  రమేష్ బియాస్  అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జార్ఖండ్ గవర్నర్‌ రమేశ్ బియాస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నియమావళిని సీఎం హేమంత్ సోరెన్ ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.  తన అభిప్రాయాన్ని  చెప్పాల్సిందిగా ఎన్నికల కమిషన్  సీల్డ్ కవర్‌లో జార్ఖండ్ రాజ్‌భవన్‌కు పంపినట్టుగా సమాచారం. 

ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం బీజేపీకి అలవాటే..
తనపై వేటు వేస్తారని  బీజేపీ నాయకులు, వారికి సంబంధించిన జర్నలిస్టులు తనపై దుస్ప్రచారం చేస్తున్నారని సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. సీల్ కవర్ లో గవర్నర్ కు సీఈసీ నివేదిక పంపినట్లుగా వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ అధికారాలు, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం బీజేపీకి అలవాటని మండిపడ్డారు. ఇప్పటి వరకు సీఎంవోకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. 
 

ఏ నివేదిక అందలేదు..
 సీఎం హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేస్తాన్న వార్తలపై గవర్నర్ రమేశ్ బియాస్‌ స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఏ లేఖ అందలేదన్నారు. తాను చికిత్స కోసం ఎయిమ్స్ కు వెళ్లినట్లు చెప్పారు. రాజ్ భవన్ కు వెళ్లాక..ఏదైనా చెప్పగలుగుతానన్నారు. 
 

మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలి
అక్రమ మైనింగ్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ  సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీని రద్దు చేసి 81 నియోజకవర్గాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు.  
 

బీజేపీ ఫిర్యాదు..
ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9-ఏను హేమంత్ సోరెన్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బిజేపీ ఫిర్యాదుపై  స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అనర్హతపై గవర్నర్ రమేష్‌ బియాస్ అభిప్రాయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని  కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్టు తెలుస్తోంది.  ఈసీ నివేదిక ఆధారంగా సీఎం సోరేన్‌పై గవర్నర్​ చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

అనర్హత వేటు వేయోచ్చా...?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం గవర్నర్ కు ఆ అధికారం ఉంటుంది. ఇందులో భాగంగా  ఒక ఎమ్మెల్యే  ఏదైనా అనర్హతలకు లోబడి ఉన్నారా.. లేదా..అనే ప్రశ్న తలెత్తితే ఈ అంశాన్ని ఎన్నికల సంఘం గవర్నర్‌కు పంపుతుంది. ఫైనల్ గా గవర్నర్ నిర్ణయమే అంతిమం.  ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని గవర్నర్ కోరవచ్చు. ఇలాంటి  కేసుల్లో ఎన్నికల సంఘం పాక్షిక-న్యాయ సంస్థగా పనిచేస్తుంది. 

హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు..
అక్రమ మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.   హర్ము హౌజింగ్ కాలనీలోని ఆయన ఇంట్లో రెండు AK-47 గన్స్‌ని స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీలో 17-20 చోట్ల ఈడీ తనిఖీలుచేపట్టింది. సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయ సన్నిహితుడు పంకజ్ మిశ్రా, అతడి అసోసియేట్ బచ్చు యాదవ్‌ను అరెస్ట్ చేసింది. జులై 8న నిర్వహించిన సోదాల్లో కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు, 50 బ్యాంకు ఖాతాల్లో రూ.13.32 కోట్ల నగదును అధికారులు జప్తు చేశారు.