అబిడ్స్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న ఢిల్లీలో ‘జర్నలిస్టుల చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణ, రక్షణకు ప్రత్యేక చట్టం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పింఛన్ పథకం, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించడం తదితర డిమాండ్ల సాధన కోసం 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ధర్నా అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, రవికుమార్, అశోక్ కుమార్, రవి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
