కోడేరు/కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు రూ.36,04,176 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో రహదారుల విస్తరణ, రిపేర్లకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని తెలిపారు.
అనంతరం ఇటీవల కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎన్నికైన కొల్లాపూర్ తైక్వాండో కింగ్స్ క్లబ్ విద్యార్థులను మంత్రి అభినందించి సన్మానించారు. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు అవసరమైన రక్షణ, శిక్షణ కిట్లను అందజేస్తామని హామీనిచ్చారు.
ఈ పోటీల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థులతో పాటు వారిని తీర్చిదిద్దిన తెలంగాణ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీహరి మాస్టర్, నాగర్ కర్నూల్ జిల్లా సెక్రటరీ శేఖర్ మాస్టర్, కొల్లాపూర్ తైక్వాండో కింగ్స్ క్లబ్ సీనియర్ మాస్టర్ శరభంద రాజ్, కోచ్ లు చెనమోని భాస్కర్ యాదవ్, ఉపేందర్, మల్లేశ్ యాదవ్, రవీందర్, తాజుద్దీన్, శివకుమార్ యాదవు, పేరెంట్స్, టీచర్లను మంత్రి
అభినందించారు.
