సోషల్ మీడియా పోస్టులు బాధించాయి : హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి

సోషల్ మీడియా పోస్టులు బాధించాయి : హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి
  •     హైకోర్టు జడ్జి జస్టిస్  మాధవీ దేవి ఆవేదన 

హైదరాబాద్, వెలుగు:  సోషల్ మీడియా వేదికలపై తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు బాధించాయని హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా భర్త ఏమిటో అందరికీ తెలుసు. కొంత మంది నన్ను ప్రభావితం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ఆశ చూపుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి” అని జడ్జి తెలిపారు. శుక్రవారం హైకోర్టులో బండి భగీరథ్ పై పోక్సో కేసు విచారణ సందర్భంగా జడ్జి ఈ కామెంట్లు చేయగా.. సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి స్పందించారు. ఇదేమీ కొత్తకాదని, మొదట మరో న్యాయమూర్తిపై ఇదే ప్రచారం జరిగిందని, ఆయన తప్పుకోవడంతో ఈ బెంచ్ కు వచ్చిందని చెప్పారు. 

ఈ విషయంలో తప్పుడు ప్రచారం సాగిందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక్కడే ఉన్నారని, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసేలా ఉండాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు స్పందిస్తూ.. తనకూ వాట్సాప్ ద్వారా సమాచారం వచ్చిందని, వెంటనే సిటీ పోలీసు కమిషనర్ కు పంపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పానని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. కేసు వినడానికి తానేం సిగ్గు పడటంలేదని, కేసును వింటానని, మెరిట్స్ పై నిర్ణయం తీసుకుంటానన్నారు.