లిక్కర్ స్కామ్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ

లిక్కర్ స్కామ్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ
  • తనపై సోషల్ మీడియాలో దుష్ర్పాచారం చేసిన వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు 
  • రాజ్యాంగ ధర్మాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం: న్యాయమూర్తి 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ గురువారం విచారణ నుంచి తప్పుకున్నారు. అయితే, ఆప్ నేతలు డిమాండ్ చేసినందుకు తాను తప్పుకోవడం లేదని, రాజ్యాంగ ధర్మాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వినయ్ మిశ్రా, సౌరభ్ భరద్వాజ్‌‌లపై స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు.

న్యాయవ్యవస్థ రాజకీయ బలంపై కాకుండా ప్రజల నమ్మకంపై నిలుస్తుందని జస్టిస్ శర్మ వ్యాఖ్యానించారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యవస్థీకృత ప్రచారానికి పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌‌పై నేను ధిక్కరణ చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో, మళ్లీ అదే కేసును నేను విచారించడం సరైన పద్ధతి కాదని భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘నేను తీర్పు ఇస్తే అది వ్యక్తిగత కక్షతో ఇచ్చానని కేజ్రీవాల్​భావించే అవకాశం ఉంది. అందుకే ఈ కేసును వేరే బెంచ్‌‌కు బదిలీ చేయాలని నిర్ణయించాను” అని పేర్కొన్నారు.

ఒక కాలేజీలో తాను ప్రసంగించిన వీడియోను ఆప్ నేతలు వక్రీకరించారని జస్టిస్ శర్మ ఆరోపించారు. ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి, తాను ఆర్‌‌ఎస్‌‌ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పిల్లలను, కుటుంబాన్ని ఈ కేసులోకి లాగడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేను మౌనంగా ఉంటే దానిని బలహీనతగా భావించారు. జడ్జి తన అంచనాలకు అనుగుణంగా ఉండకపోతే వారిని కించపరచడం కేజ్రీవాల్ ధోరణిలా కనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు. తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్లాలి తప్ప, జడ్జిల వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ఎగతాళి చేయడం న్యాయవ్యవస్థకే ముప్పు అని జస్టిస్ శర్మ అభిప్రాయపడ్డారు.

జడ్జిలు వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండరని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని బద్నాం చేసినా భరించానని, కానీ రాజ్యాంగబద్ధమైన న్యాయ వ్యవస్థకు నష్టం కలిగిస్తామంటే సహించబోనని హెచ్చరించారు. లిక్కర్ స్కామ్‌‌లో ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌‌ను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో ఉంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకోవడంతో ఈ కేసును విచారించే కొత్త బెంచ్‌‌ను హైకోర్టు సీజే నిర్ణయించనున్నారు. కాగా,  లిక్కర్ స్కాంలో ఆప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియా, టీఆర్ఎస్ అధినేత్రి కవితో పాటు మరో 23 మందికి ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.