శివలింగంపై పోసిన నీళ్లు గోదావరిలో కలుస్తాయి

శివలింగంపై  పోసిన నీళ్లు గోదావరిలో కలుస్తాయి

చారిత్రక ప్రదేశాల్ని నేరుగా వెళ్లి చూస్తే థ్రిల్లింగ్​గా ఉంటుంది. ఎందుకంటే.. అక్కడి శిల్పాలు, కట్టడాలు చూస్తూ చరిత్రలోకి ఒకసారి వెళ్లి రావచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి వెళ్తే అలాంటి అనుభూతి కలగడం ఖాయం. కాకతీయుల కాలం నాటి కోటగుళ్లు, ‘దక్షిణ కాశీ’గా పేరొందిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గుడి  ఈ జిల్లాలోనే ఉన్నాయి. అంతేకాదు మహాభారత కాలం నాటివిగా చెప్పే పాండవుల గుహల్ని ఇక్కడ చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో పాటు నల్ల బంగారం దొరికే సింగరేణి బొగ్గు గనుల్ని కూడా చూసేయొచ్చు.

మనరాష్ట్రంలోని పురాతన దేవాలయాల్లో ‘కాళేశ్వర ముక్తేశ్వర స్వామి’ ఆలయం ఒకటి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలవడం వల్ల ఈ ప్రాంతాన్ని ‘త్రివేణి సంగమం’గా పిలుస్తారు. ‘దక్షిణ కాశీ’గా ఈ ప్రాంతం ప్రసిద్ధి. గర్భగుడిలో ఒకే బండ మీద రెండు శివలింగాలు ఉండడం ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి. శివుడు ‘ముక్తేశ్వరుడు’గా, యమధర్మరాజు ‘కాళేశ్వరుడు’గా పూజలందుకుంటారు ఇక్కడ. దీని వెనక ఓ కథ ఉంది. ముక్తేశ్వర స్వామిగా ముక్తిని ప్రసాదిస్తున్న పరమశివుడిని, యమధర్మరాజు వేడుకున్నాడట. దాంతో, యముడిని కూడా తన పక్కనే లింగాకారంలో  నిల్చోమన్నాడట శివుడు. ముక్తేశ్వర లింగానికి రెండు రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రంలో  ఎన్ని నీళ్లు పోసినా నిండకపోవడం ఇక్కడ  కనిపించే అద్భుతం. అయితే, ఆ శివలింగం రంధ్రంలో పోసిన నీళ్లు గోదావరిలో కలుస్తాయని చెప్తారు అక్కడివాళ్లు.  

నైన్పాక గుడి
చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామంలోని గుడి 16వ శతాబ్దం కాలం నాటిది.  ‘సర్వటోభద్ర’ వాస్తు శిల్పానికి నమూనా ఈ గుడి. అంటే.. నాలుగు వైపులా నాలుగు దేవతా విగ్రహాలు ఉంటాయి. తూర్పున యోగ ముద్రలో కూర్చొన్న ఉగ్రనరసింహుడు, దక్షిణం వైపు కలీయ వేణుగోపాల స్వామి, ఉత్తరం వైపు శ్రీరాముడు, పడమర దిశలో బలరాముడి విగ్రహాల్ని చూడొచ్చు. దక్షిణభారతదేశంలో ‘సర్వటోభద్ర వాస్తు శైలిలో’ కట్టిన గుడి ఇదొక్కటే. 50 అడుగుల ఎత్తైన గోపురం పై భాగాన్ని ఇటుకలతో, కింది భాగాన్ని గులాబీ రంగు రాళ్లతో కట్టారు. 

సైజ్​, డిజైన్ ఒకేలా ఉండవు  
కాకతీయుల శిల్పకళకి సాక్ష్యంగా నిలిచే కట్టడాల్లో ఘన్​పూర్​ కోటగుళ్లు చెప్పుకోదగ్గవి. వీటిని పదమూడో శతాబ్దం తొలినాళ్లలో గణపతి దేవుడు కట్టించాడని చెప్తారు. ప్రధాన గుడిని ‘గణపేశ్వరాలయం’ అంటారు. ఇందులో శివుడు కొలువై ఉంటాడు. ప్రధాన ఆలయం చుట్టూ ఒకప్పుడు 22 చిన్న గుళ్లు ఉండేవి.  ప్రతి గుడి సైజ్, డిజైన్ వేరువేరుగా ఉండడం కోటగుళ్ల స్పెషాలిటీ. ఒక రాతి స్తంభంపై చెక్కిన  ఏనుగు మీద సవారీ చేస్తున్న సగం మనిషి, సగం సింహం ఆకారంలో ఉన్న శిల్పం చూడొచ్చు.  

పాండవుల గుట్టలు
రేగొండ మండలంలోని తిరుమలగిరి ఊళ్లో పాండవుల గుట్టలు ఉన్నాయి.  అరణ్యవాసంలో పాండవులు  ఇక్కడ కొన్నాళ్లు ఉన్నారట. అందుకనే వీటికి ‘పాండవుల గుహలు’, ‘పాండవుల గుట్ట’ అనే పేరొచ్చింది. ఈ గుహలు ఉత్తరం నుంచి దక్షిణం దిక్కు వైపు వరుసగా ఉంటాయి. వీటి  గోడలు, సీలింగ్ మీద  ప్రాచీన, మధ్య రాతియుగం నాటి రాతి బొమ్మలు కనిపిస్తాయి. ఆది మానవులు జంతువుల్ని వేటాడడం కోసం ఉపయోగించిన కత్తులు, ఈటెలు, విల్లులు, బాణం బొమ్మల్ని ఇక్కడ చూడొచ్చు. ఈ గుహల్లోని కొన్ని జాగలని ‘మేకలబండ, ముంగిసబండ, వరాహ పర్వతం,  పులి పర్వతం, యానాదుల గుహ, కుంతీ దేవి, పంచ పాండవులు’..ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అడ్వెంచరస్​ స్పోర్ట్స్​ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ కొండలు ఎక్కడంతో పాటు రాపెల్లింగ్ కూడా చేయొచ్చు. 

టైమింగ్స్:  అన్ని రోజులూ తెరిచే ఉంటుంది. ఎంట్రీ – ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.  
ఎంట్రీ టికెట్: పిల్లలకు 10 . పెద్దలకు  20 రూపాయలు. 

ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది జయశంకర్ భూపాల పల్లి జిల్లా. వరంగల్​ నుంచి 60 కిలోమీటర్ల  జర్నీ చేస్తే, ఘన్​పూర్​ కోటగుళ్లకి చేరుకో వచ్చు.  హైదరాబాద్​ నుంచి ఇక్కడికి 
140 కిలోమీటర్ల దూరం. పాండవుల గుట్టకి వెళ్లాలంటే... జిల్లా కేంద్రం నుంచి దాదాపు 23 కిలోమీటర్ల జర్నీ చేయాలి.