ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది

ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది

ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. ఏరోజు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఖర్చుల తగ్గింపులో భాగంగా టెక్ దిగ్గజం గూగుల్.. గత కొన్ని వారాలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటిస్తోంది. తాజాగా, సుందర్ పిచాయ్ నేతృత్వంలోని పైథాన్ టీమ్‌లో ఉన్న ఉద్యోగులందరినీ తొలగించినట్టు నివేదికలు వస్తున్నాయి. ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రకారం, ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికా వెలుపల తక్కువ జీతంతో పనిచేసే వారిని నియమించుకునేందుకు గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పాత వారిని తొలిగించినట్లు కథనాలు వస్తున్నాయి.

గూగుల్ యాజమాన్యం తీసుకున్న తొలగింపు నిర్ణయం పట్ల తాను చాలా బాధపడ్డానని, తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఉద్యోగమని మాజీ గూగుల్ పైథాన్ టీమ్ సభ్యుడొకరు పేర్కొన్నట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కంపెనీ, జర్మనీలోని మ్యూనిచ్‌లో కొత్త టీమ్‌ని నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని పైథాన్ టీమ్‌లో 10 మంది కంటే తక్కువ మందితోనే కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పైథాన్ అనేది అత్యంత అధునాతనమైన ప్రోగ్రామింగ్ భాష. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇది చాలా కీలకం.

కాగా, గూగుల్ యాజమాన్యం ఇటీవల రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విభాగాల్లో ప్రెషర్స్ ను నియమించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది.