ఇన్వెస్టర్లకు సిల్వర్ షాక్.. 3 గంటల్లో రూ.21వేలు పతనం.. కారణం ఏంటంటే..?

ఇన్వెస్టర్లకు సిల్వర్ షాక్.. 3 గంటల్లో రూ.21వేలు పతనం.. కారణం ఏంటంటే..?

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX) మార్కెట్‌లో వెండి ధరలు సోమవారం ఊహించని రీతిలో భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2లక్షల54 వేలకు చేరుకుని ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తర్వాత మూడు గంటల వ్యవధిలోనే వెండి రేటు ఏకంగా రూ. 21వేలకు పైగా పతనమై రూ.2లక్షల 33వేల స్థాయికి పడిపోయింది. మార్కెట్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో ధర తగ్గడం చాలా అరుదైన విషయమని నిపుణులు అంటున్నారు.

వెండి ధరలు ఇలా ఒక్కసారిగా కుప్పకూలడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది అంతర్జాతీయ స్థాయిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు వస్తుందన్న ఆశలు చిగురించడమే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి ఒప్పందం దిశగా సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో వెండిపై పెట్టుబడి పెట్టే వారి నుంచి డిమాండ్ తగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 80 డాలర్ల నుంచి 75 డాలర్ల కంటే కిందికి జారుకుంది.

ఇవాళ్టి వెండి పతనానికి రెండో కారణం ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి వెండి ఏకంగా 180% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. గతేడాది డిసెంబర్‌లో రూ.87వేల 233 వద్ద ఉన్న కేజీ వెండి ధర.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రూ.లక్షా 66వేల మేర పెరగడం ఇన్వెస్టర్లను లాభాల బుకింగ్‌ వైపు ప్రేరేపించింది. ఉదయం ధరలు గరిష్ట స్థాయికి చేరగానే.. ఇన్వెస్టర్లు అస్సలు ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా అమ్మకాలకు దిగటంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధర వేగంగా పతనమైంది.

ALSO READ : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్

ఇక చివరిగా చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME) వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై మార్జిన్ మొత్తాన్ని పెంచడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. మార్జిన్ అవసరాలు 20వేల డాలర్ల నుండి 25వేల డాలర్లకు పెరగడంతో ట్రేడర్లపై ఆర్థిక భారం పెరిగి.. వారు తమ పొజిషన్లను తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే 2026 జనవరి నుండి వెండి ఎగుమతులపై చైనా విధించనున్న ఆంక్షలు, పారిశ్రామికంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా వెండి దీర్ఘకాలికంగా బులిష్ మెుమెంటం కలిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.2లక్షల 40వేల స్థాయి వెండికి కీలక సపోర్ట్ జోన్ అంటున్నారు మార్కెట్ నిపుణులు.