స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్: నిబంధనలు చెప్పకుండా క్లెయిమ్ ఎగ్గొట్టడం చెల్లదన్న కోర్ట్..

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్: నిబంధనలు చెప్పకుండా క్లెయిమ్ ఎగ్గొట్టడం చెల్లదన్న కోర్ట్..

హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీల ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట వేస్తూ చండీగఢ్ జిల్లా కన్జూమర్ ఫోరమ్ కీలక తీర్పు వెలువరించింది. పాలసీ జారీ చేసే సమయంలో నిబంధనలను, మినహాయింపులను కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించి, పాలసీదారు అంగీకారం తీసుకోకుండా.. క్లెయిమ్ సమయంలో వాటిని సాకుగా చూపి డబ్బులు తగ్గించడం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. 

చండీగఢ్‌కు చెందిన ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్' నుంచి 'ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా' ప్లాన్ కొనుగోలు చేశారు. 2021లో సుమారు రూ.22వేల 875 ప్రీమియం చెల్లించి పాలసీని రెన్యూవల్ కూడా చేసుకున్నారు. దీని ప్రకారం అతని కుటుంబానికి గరిష్టంగా రూ.15 లక్షల 50వేల వరకు కవరేజీ ఉంది. అయితే 2022 జూలైలో ఆయన భార్యకు కాన్పూర్‌లోని ఒక ఆసుపత్రిలో బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. ఇందుకు గాను ఆసుపత్రి బిల్లు రూ.2లక్షల 25వేలు అయింది.

పాలసీదారు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. స్టార్ హెల్త్ కంపెనీ కేవలం రూ.69వేల 958 మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.లక్షా55 వేలను వివిధ అంతర్గత నిబంధనలు, మినహాయింపుల పేరుతో కోత విధించింది. దీనిపై సరైన వివరణ లేకపోవడంతో.. సదరు పాలసీదారుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. తన ప్రీమియం సక్రమంగా ఉన్నా కవరేజీ సరిపడా ఉన్నా కంపెనీ అన్యాయంగా డబ్బులు తగ్గించిందని ఫిర్యాదు చేశారు.

ALSO READ : జనవరి 1 నుండి కొత్త రూల్స్

విచారణలో ఇన్సూరెన్స్ కంపెనీ తనను తాను సమర్థించుకుంటూ.. పాలసీదారుడు అన్ని నియమ నిబంధనలు చదివి అంగీకరించిన తర్వాతే పాలసీ తీసుకున్నారని వాదించింది. కానీ.. ఆ నిబంధనల పత్రాలపై పాలసీదారు సంతకం ఎక్కడ ఉందని కోర్టు ప్రశ్నించింది. సదరు మినహాయింపు నిబంధనలను పాలసీదారుకు వివరించినట్లు లేదా అందించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది.

ఇన్సూరెన్స్ ఒప్పందాలు 'అత్యంత విశ్వాసం' అనే సూత్రంపై నడుస్తాయని, ఇది కంపెనీలకు కూడా వర్తిస్తుందని కమిషన్ పేర్కొంది. నిబంధనలను గోప్యంగా ఉంచి.. క్లెయిమ్ సమయంలో వాటిని బయటకు తీయడం అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే చెడ్డ వాణిజ్య విధానాల కిందకు వస్తుందని తేల్చి చెప్పింది. దీంతో బాధితుడికి రావాల్సిన మిగిలిన రూ.లక్షా55వేల 042 మొత్తాన్ని 9% వడ్డీతో కలిపి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కంపెనీ నిర్లక్ష్యం వల్ల బాధితుడు ఎదుర్కొన్న మానసిక వేదనకు పరిహారంగా రూ.20వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని స్టార్ హెల్త్ కంపెనీని కోర్టు ఆదేశించింది.