హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ గీతం జన గణ మన అవగానే సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.
సభకు హాజరైన కేసీఆర్ ఇలా కూర్చొని అలా వెళ్లిపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కనీసం దివంగత సభ్యుల సంతాప తీర్మానం వినేందుకు కూడా కేసీఆర్ ఉండకుండా వెళ్లిపోవడం సభా మర్యాదను పాటించకపోవడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్‌లో కేసీఆర్ సంతకం చేశారు. ఆ తర్వాత సభలోకి వెళ్లారు. సభలో కేసీఆర్‌ను చూసిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ కోసం కాదు అసెంబ్లీకి అన్ని రోజులు రావాలని కేసీఆర్కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హిత బోధ చేశారు.
వాస్తవానికి సభను కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా నిర్వహించాలన్న రూల్ ఉంది. దాని ప్రకారమే ఎమ్మెల్యేలు కూడా కనీసం ఆరు నెలలకో సారైనా వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది. చివరి సారిగా మార్చి 12న అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత ఆరు నెలలకు ఆగస్టులో నిర్వహించిన సమావేశాలకు హాజరు కాలేదు. సంతకం కూడా చేయలేదు.
ఇప్పుడు కూడా వచ్చి సంతకం చేయకపోతే సభా నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందని, ఆయన శాసన సభ్యత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలియడంతో కేసీఆర్ సోమవారం శాసన సభకు హాజరై సంతకం చేసి వెళ్లిపోయారు.
