దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన విషవాయువు కేవలం సామాన్యులనే కాదు.. కార్పొరేట్ దిగ్గజాలను కూడా వణికిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ ఉన్నతాధికారి ఏకంగా తన పదవికే రాజీనామా చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రూ. 7వేల కోట్ల మార్కెట్ విలువ గల కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కాలుష్యం వల్ల రాజీనామా చేయడం.. ఢిల్లీలోని పర్యావరణ అత్యవసర పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ 'అక్యుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్' ఫైనాన్స్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ బాఫ్నా నగరంలోని కాలుష్యాన్ని భరించలేక తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్ 31, 2025 నుంచి తన విధులకు స్వస్తి చెప్పనున్నారు. సాధారణంగా వ్యక్తిగత కారణాలు చెప్పి చాలా మంది రాజీనామాలు చేస్తుంటారు. కానీ.. బాఫ్నా మాత్రం తన రెజిగ్నేషన్ లెటర్‌లో ఢిల్లీలోని కాలుష్య స్థాయిల కారణంగానే తప్పుకుంటున్నానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయటం పెద్ద చర్చకు దారితీసింది.
నవంబర్ నుంచి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సోమవారం గాలి నాణ్యత సూచీ 403కి పడిపోవడంతో 'తీవ్రమైన' కేటగిరీగా గుర్తించారు. బాఫ్నా గత కొంతకాలంగా దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని.. ముంబై వంటి నగరాల్లో ఉండి వచ్చిన వారికి ఢిల్లీ వాతావరణం ఏమాత్రం పడటం లేదని కంపెనీ యాజమాన్యం కూడా అంగీకరించింది. ఆరోగ్యం కంటే ఉద్యోగం ముఖ్యం కాదని భావించి ఆయన రాజీనామాను కంపెనీ కూడా ఆమోదించింది.
ఎయిర్ పొల్యూషన్ కారణంగా గాలిలోని అతి సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల ద్వారా నేరుగా రక్తంలోకి చేరుతాయి. ఇది ఆస్తమా, హార్ట్ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ప్రాణాంతకం. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులపై దీని ప్రభావం అత్యధికంగా ఉంటుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
