ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో ఒక వింత ఘటన స్థానికులను భయపెట్టింది. రేబిస్ సోకిన కుక్క కరిచిన గేదె పాలను వాడటం వల్ల ఊరందరికీ రేబిస్ సోకుతుందేమో అని భయంతో దాదాపు 200 మందికి టీకాలు వేశారు.
అసలేం జరిగిందంటే... డిసెంబర్ 23న పిప్రౌలి గ్రామంలో ఒకరి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకి వచ్చిన అతిథులకు, గ్రామస్తులకు భోజనంలో మజ్జిగా వడ్డించారు. అయితే ఆ మజ్జిగ తయారు చేయడానికి ఉపయోగించిన పాలు ఒక గేదెకు చెందినవి. అయితే ఆ గేదెను కొద్దీ రోజుల క్రితం ఒక రేబిస్ సోకిన కుక్క కరిచింది.
ఆ గేదె డిసెంబర్ 26న రేబిస్ లక్షణాలతో చనిపోయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. గేదె పాలు వాడటం వల్ల మాకు కూడా రేబిస్ వస్తుందేమో అని భయపడి వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు.
గ్రామస్తుల రాకతో ఉఝాని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు రంగంలోకి దిగి వాక్సిన్ అందించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ సాధారణంగా పాలను బాగా వేడి చేస్తే రేబిస్ వైరస్ చనిపోతుంది, ఉండదు. కానీ ప్రజల అనుమానాలను తొలగించడానికి ముందుజాగ్రత్తగా అందరికీ యాంటీ రేబిస్ టీకాలు వేశాం అని అన్నారు.
అలాగే శని, ఆదివారాల్లో కూడా ఆసుపత్రి తెరిచి ఉంచి అందరికీ ఇంజెక్షన్లు ఇచ్చాము. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
మా గ్రామంలో ధర్మపాల్ అనే వ్యక్తికి చెందిన గేదెను కుక్క కరిచింది. ఆ పాలు వాడటం వల్లే మాకు ఇన్ఫెక్షన్ వస్తుందని భయపడ్డాం. అందుకే అందరం కలిసి టీకాలు వేయించుకున్నాం అని గ్రామస్తులు చెప్పుకొచ్చారు.
