వీహెచ్, కుసుమ కుమార్ కు చాన్స్ ఇవ్వండి : జగ్గారెడ్డి

వీహెచ్, కుసుమ కుమార్ కు చాన్స్ ఇవ్వండి : జగ్గారెడ్డి
  •     రాజ్యసభ సీట్లపై ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు జగ్గారెడ్డి విజ్ఞప్తి 
  •     ఢిల్లీలో పార్టీ చీఫ్​​ను కలిసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాలలో వీహెచ్, కుసుమకుమార్ కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మ‌‌ల్లికార్జున ఖ‌‌ర్గేను ఆయన క‌‌లిశారు. తాను ప్రతిపాదించిన ఈ ఇద్దరికి అవ‌‌కాశం ఇవ్వాల‌‌ని కోరారు. ఆపై ఖ‌‌ర్గేతో ప‌‌లు కీల‌‌క అంశాల‌‌పై జగ్గారెడ్డి చ‌‌ర్చించారు. అనంత‌‌రం ఆయ‌‌న తెలంగాణ భ‌‌వ‌‌న్‌‌లో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కాంగ్రెస్‌‌లో సీనియ‌‌ర్ నేత‌‌లైన వి.హ‌‌నుమంత‌‌రావు, జెట్టి కుసుమకుమార్ కు రాజ్యసభ అవకాశం ఇవ్వాల‌‌ని కోరినట్టు తెలిపారు. రాజ్యసభ అవకాశాలపై సమాలోచనలు చేశామన్నారు. కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్ తో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారైనందున అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఆయ‌‌నది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ అని, వారి కుటుంబం అంతా కాంగ్రెస్ లోనే ఉన్నారన్నారు.

అలాగే వీహెచ్​ తెలంగాణలో అనేక మంది సీఎంలతో పని చేసిన అనుభవంతో పాటు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారని వయసులో పెద్ద వ్యక్తి, చురుకైన వ్యక్తి అయిన వీహెచ్‌‌ కు మరో సారి చాన్స్ ఇవ్వాలని అడిగానని చెప్పారు.

తన ప్రతిపాదనపై కమిటీతో చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చారన్నారు. రాజ్యసభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. తాను రాహుల్ గాంధీని, ఖర్గేను కలవడానికి ఢిల్లీ వచ్చానని, అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా రాహుల్ బిజీగా ఉండటంతో కలవలేకపోయానని అన్నారు. త్వరలో ఆయన  రాష్ట్ర పర్యటనకు వస్తారని, అప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు.