వెలుగు ఓపెన్ పేజీ: ఆదివాసీల ఆత్మబంధువు బియ్యాల

వెలుగు ఓపెన్ పేజీ: ఆదివాసీల ఆత్మబంధువు బియ్యాల

బహుముఖ ప్రజ్ఞాశాలి,  ఆదివాసుల భూమి హక్కులు వారికే దక్కాలని పోరాడిన వారి ఆత్మబంధువు డాక్టర్ బియ్యాల జనార్దన్ రావు.  దోపిడీకి గురవుతున్న తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే అంతిమ లక్ష్యమని ఆయన ఉద్యమించారు.  రైతుల పక్షాన పోరాటం,  నక్సలైట్లతో శాంతిచర్చలు జరపాలనే  అంశం... ఇలా  అన్ని విషయాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.  తన కలానికి పదును పెడుతూనే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ఉద్యమ నాయకుడు డాక్టర్ బియ్యాల జనార్దన్ రావు.  

1955  అక్టోబర్ 12న  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో అంజనమ్మ, కిషన్ రావు దంపతులకు బియ్యాల జనార్దన్ రావు జన్మించాడు.  1983లో  కాకతీయ విశ్వవిద్యాలయంలో  చదువు పూర్తి చేసిన ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్  విభాగంలో  పార్ట్ టైం అధ్యాపకుడిగా  కొంతకాలం పని చేశారు.  ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్​గా,  ప్రొఫెసర్​గా విధులు నిర్వహించాడు.  ప్రజా సమస్యలను ఉద్యమాలుగా మలచడంలో ఆయన ఎప్పుడూ ముందున్నారు.

గిరిజనుల ఉన్నతికోసం ఆరాటం

ఆదివాసుల అమాయకత్వం వారి వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని అక్కడి భూములను గిరిజనేతరులు, పెత్తందారులు ఆక్రమించుకున్న అంశంపై ఆయన గిరిజనులను చైతన్యపరిచారు.  అంతేకాకుండా 1/70 చట్టాన్ని అమలు చేయాలని  ప్రభుత్వంపై  ఒత్తిడి  తీసుకొచ్చారు. 'గిరిజన భూముల పరాయీకరణ'  అనే అంశంపై 1985లో  బియ్యాల పరిశోధన చేసి  పీహెచ్​డీ  పట్టా పొందిన తొలి గిరిజనేతర వ్యక్తిగా నిలిచాడు. 

పౌరహక్కుల ఉద్యమంలో సైతం ఆయన పాల్గొన్నాడు. 1982లో  వరంగల్ లో  కరువుపై పరిశీలన బృందంలో  బియ్యాల ఒకరు. 1993 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో  ఆదివాసీ ఉద్యమాలు,  ఏజెన్సీ ప్రాంత సమస్యలపై అనేక వ్యాసాలు రాశాడు. 1999లో  కన్నబిరాన్, ఎస్.ఆర్. శంకరన్  తదితరులుతో  కలిసి  నక్సలైట్లతో  శాంతిచర్చలు  జరపాలనే ఎజెండాను ఆయన తీసుకొచ్చారు. 

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించాడు.   తెలంగాణకు  జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాల్ని,  వివక్షతపై ఆయన అనేక వేదికలపై  గళమెత్తడమే కాకుండా అనేక రచనలు చేశాడు.  అమెరికాలో  జరిగిన తానా సభలో   ప్రొఫెసర్  జయశంకర్​తో  కలిసి పాల్గొని  తెలంగాణ ఆవశ్యకతపై  ప్రసంగించారు.  

ప్రత్యేక తెలంగాణ  కోసం 2001లో  ఏర్పడిన  తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో  ఆయన  ప్రధాన భూమికను పోషించాడు.  వచ్చిన తెలంగాణను చూడకుండానే, 2002 ఫిబ్రవరి 27న బియ్యాల జనార్దన్ రావు కన్నుమూశాడు.  ఆయన భౌతికంగా లేకపోయినా తెలంగాణను సాధించడంలో చివరికంటూ ఆయన స్పూర్తి ఉద్యమానికి ఉపయోగపడింది. బియ్యాల జనార్దన్​రావు చేసిన రచనలు  ఆయనను  నేటికి సజీవంగా నిలుపుతున్నాయి. 

- తాళ్ళపెల్లి సురేందర్