విద్యార్థులపై హత్యాయత్నం చేశారంటూ..ప్రైవేట్ స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

విద్యార్థులపై హత్యాయత్నం చేశారంటూ..ప్రైవేట్ స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొంటూ పేరెంట్స్, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దవంగర మండలం టిక్యాతండా, అన్నారం గ్రామాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్​ హాస్టల్​లో ఉంటూ 5వ తరగతి చదువుతున్నారు.

రెండు రోజుల కింద అర్ధరాత్రి హాస్టల్​లో పడుకొని ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తువ్వాలుతో మెడకు ఉరి వేసి హత్య చేసేందుకు యత్నించారు. విద్యార్థులు అరవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.

విద్యార్థులు ఈ విషయాన్ని హాస్టల్​ వార్డెన్, యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు పేరెంట్స్​కు సమాచారం ఇవ్వడంతో గురువారం వారు స్కూల్​కు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూల్​ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు.