ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‎సింగ్ బెయిల్ రద్దు

ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‎సింగ్ బెయిల్ రద్దు

న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్​సెంగర్‌ శిక్షను సమర్ధిస్తూ‎, బెయిల్‎ రద్దు చేసింది సుప్రీం కోర్టు. కుల్దీప్​సెంగర్‌‎ శిక్షను నిలిపివేయడంతో పాటు, బెయిల్ మంజురూ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అనంతరం కుల్దీప్ సెంగర్‎కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

2017లో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజకీయ పలుకుబడితో విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశాడు. బాధితురాలు సీఎం యోగిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడంతో ఈ విషయం బయటపడింది. సంచలనం సృష్టించిన ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. 

విచారణ జరిగే సమయంలో బాధితురాలి తండ్రి కష్టడీలో మరణించడం, బాధితురాలు సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు కోర్ట్‎కు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ పరిణామాలతో  కేసు విచారణను యూపీ నుంచి ఢిల్లీ కోర్ట్‎కు ట్రాన్స్ ఫర్ చేసి విచారణ చేపట్టాలని సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ కోర్ట్‎లో 2019, ఆగస్ట్  నుంచి ఈ కేసుపై విచారణ ప్రారంభమైంది. ఇరు వర్గాల వాదనల అనంతరం.. సెంగార్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తేల్చిన తీస్ హజారీ కోర్ట్ నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెంగర్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌ పెండింగులో ఉండటంతో దీనిపై తీర్పు వెలువడేంత వరకూ సెంగర్‌ శిక్షను సస్పెండ్‌ చేస్తున్నట్లు జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్‌ హరీష్‌ వైద్యనాథన్‌ శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సెంగర్‎కు షరతులపై బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నిందితుడు సెంగర్‎ శిక్షను సస్పెండ్ చేయడంతో పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.