అసెంబ్లీకి కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంపై మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్

అసెంబ్లీకి కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంపై మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో ముచ్చటించారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగానని, బాగుందని కేసీఆర్ బదులిచ్చారని మంత్రి చెప్పారు. తన ఆరోగ్యం గురించి కూడా కేసీఆర్ అడిగారని, బావుందని చెప్పానని కోమటిరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపితే  సభలో లేకుండా కేసీఆర్ వెళ్లి పోవడం సరైంది కాదని, మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెళ్తే బావుండేదని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ హాస్పిటల్లో దీక్ష చేశాడని, తాను రోడ్లపై దీక్ష చేశానని, తాను ఒరిజినల్ ఉద్యమకారుడినని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారని మంత్రి గుర్తుచేశారు. రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో చిట్ చాట్లో చెప్పారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జాతీయ గీతం జన గణ మన అవగానే సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. సభకు హాజరైన కేసీఆర్ ఇలా కూర్చొని అలా వెళ్లిపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కనీసం దివంగత సభ్యుల సంతాప తీర్మానం వినేందుకు కూడా కేసీఆర్ ఉండకుండా వెళ్లిపోవడం సభా మర్యాదను పాటించకపోవడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.