ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంలోకి వచ్చాక టెక్నాలజీలో అలాగే మనిషి చేసే పనుల్లో చాలా మార్పులు వచ్చాయి. AIతో కొన్ని పనులు ఈజీగా అయిపోతున్న భవిష్యత్తులో కొన్ని రంగాలకి, మనిషికి కూడా ముప్పుగా పరిగణించొచ్చు. ఇప్పటీ AIతో వచ్చే నష్టాలను కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే చైనా దేశం మాత్రం AIని ఒక అవసరానికి వాడుకునేందుకు వీలుగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. AI ఇప్పుడు కేవలం సమాచారం ఇవ్వడమే కాకుండా మనుషులతో స్నేహితుల్లా, ప్రేమగా మాట్లాడుతూ భావోద్వేగాలను పంచుకుంటోంది. దీనివల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉండవచ్చని భావిస్తూ చైనా ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకువచ్చింది.
ఈ రూల్స్ ఏంటంటే : AI మనుషుల్లా నటించకూడదు అంటే AI సాఫ్ట్‌వేర్‌లు మనుషుల వ్యక్తిత్వాలను అనుసరించడం, అచ్చం మనిషిలాగే మాట్లాడుతున్నట్లు నమ్మించడం వంటివి చేయకూడదు.
టెక్స్ట్, ఆడియో లేదా వీడియో ద్వారా వినియోగదారులతో అతిగా భావోద్వేగ సంబంధాలు ఏర్పరచుకోకుండా నియంత్రించాలి. వినియోగదారులు AI కి అలవాటుపడి రోజంతా దానితోనే గడపకుండా కంపెనీలు జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎవరైనా అతిగా వాడుతుంటే వారిని హెచ్చరించాలి.
ఎవరైనా AI పై ఎంతవరకు ఆధారపడుతున్నారు ? అనేది కంపెనీలు గమనించాలి. ఎవరైనా ప్రమాదకరంగా ప్రవర్తిస్తుంటే వెంటనే ఆ సర్వీస్‌ను ఆపేయాలి. దేశ భద్రతకు ముప్పు కలిగించే విషయాలు, అబద్ధపు ప్రచారాలు, హింస లేదా అసభ్యకరమైన కంటెంట్‌ను AI సృష్టించకుండా కఠినమైన రెడ్ లైన్స్ విధించారు.
కంపెనీల బాధ్యత:
ఇకపై AI సేవలు అందించే కంపెనీలే అన్నిటికి పూర్తి బాధ్యత వహించాలి. వినియోగదారుల డేటా భద్రత, ప్రైవసీ, వారు వాడుతున్న అల్గారిథమ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చైనా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల AI ఇకపై మనతో ఒక మెషిన్ లాగే మాట్లాడుతుంది కానీ, ఒక ప్రాణ స్నేహితుడిల మన భావోద్వేగాలతో ఆడుకోలేదు. ఇది వినియోగదారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి తీసుకున్న చర్యగా కనిపిస్తోంది.
