కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేసింది. నిర్వహణ సమయంలో ఇతరులను లోనికి అనుమతించకుండా తలుపులు మూసివేసి ఒక్కొక్కరిగా ఉద్యోగులతో విచారణ జరిపారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ .. జమ్మికుంట మున్సిపాలిటీలో రికార్డులు సరిగా లేవని, ఉద్యోగులకు సంబంధించిన అటెండెన్స్ వివరాలు పూర్తిగా నమోదు చేయకుండా వదిలివేశారని తెలిపారు. ఇన్ వార్డులో వచ్చిన ఫిర్యాదులు, బయట ఉన్న ఫిర్యాదుల గురించి పట్టించుకోవడంలేదని వెల్లడించారు. మ్యూటేషన్ వివరాలు సరిగా నమోదు చేయలేదని బిల్డింగ్ సంబంధించిన పర్మిషన్లు అనుమతులు సరిగా లేవని తెలిపారు. అనధికారికంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 41,117 రూపాయలు దొరికాయని వాటికి సంబంధించిన వివరాలు కానీ బిల్లులు కానీ సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వలేదన్నారు. ప్రతినిత్యం జెసిబి లెవెలింగ్ బ్లేడుకు 5 వేల రూపాయల బిల్లును డ్రా చేస్తున్నారని దానికి సంబంధించిన వివరాలు సైతం చూపలేదని, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న ఇతర వెహికిల్ ల యొక్క వినియోగం వాటికి సంబంధించిన బిల్లులు అధికారికంగా లేవన్నారు.
►ALSO READ | హైదరాబాద్ సనత్ నగర్ లో మహిళ హత్య కేసు...14 ఏళ్ల తర్వాత హంతకుడికి మరణశిక్ష విధించిన కోర్టు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సదానందం వద్ద ఫోన్ పే లో కొన్ని డబ్బులు ఉన్నాయని వాటికి సంబంధించిన సమాధానం సరిగా లేకపోవడంతో ఆ ఫోను సీజ్ చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమాచారంతోపాటు వెహికల్ కు సంబంధించిన రిపేరు బిల్లులు సరిగా లేవని తమ సోదాలో బయటపడ్డాయన్నారు. పూర్తి రికార్డులను తమ స్వాధీనం చేసుకొని వారం రోజుల్లో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. ఈ సోదాల్లో ముగ్గురు సీఐలతో పాటు తొమ్మిది మంది సిబ్బంది పాల్గొన్నారు.
