- కొత్త సంవత్సరంలో వేరే దేశానికి వెళ్లి బిజినెస్ చేసుకుంట
- ఇటు రాష్ట్ర జీఎస్టీ, అటు సెంట్రల్ ఐటీ అధికారుల తనిఖీలతో విసుగు
బెంగళూరు: మన దేశంలోని పన్నుల విధానంపై ఓ యువ పారిశ్రామికవేత్త భావోద్వేగమైన పోస్టు పెట్టారు. తాను నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నా.. నోటీసులు మీద నోటీసులు వస్తున్నాయని, వాటికి సమాధానం ఇవ్వడానికే టైమంతా కేటాయించాల్సి వస్తున్నదని వాపోయారు. డబ్బుతో పాటు సమయం కూడా వెచ్చించాల్సి రావడంతో వ్యాపారం చేయడానికి సమయం ఉండడట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అంతా మాటలకే పరిమితమైందని విమర్శించారు. నిజాయితీగా ట్యాక్స్ చెల్లించే తమలాంటి 5 శాతం మందినే అందరూ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే, 2026లో ఫారెన్ కంట్రీకి వెళ్లి అక్కడే బిజినెస్ చేయాలని అనుకుంటున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన బాధను వెలిబుచ్చారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. బెంగళూరుకు చెందిన ఎంటర్పెన్యూర్ రోహిత్ ష్రాఫ్ ‘అఫ్లాగ్’ గ్రూప్ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గత 12 నుంచి 18 నెలల కాలంలోనే తాను జీఎస్టీ, ఆదాయపు పన్ను వంటివి కలిపి రూ. 4 కోట్ల వరకు చెల్లించానని చెప్పారు.
అయినా రాష్ట్ర జీఎస్టీ అధికారులు ఒక వైపు, కేంద్ర ఐటీ శాఖ అధికారులు మరో వైపు నోటీసుల మీద నోటీసులు పంపు తూ వేదిస్తున్నారని, ఆఫీసుకు వచ్చి పదే పదే దీనిపైనే ఆరా తీస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదో తప్పు చేసినట్లుగా అనుమానిస్తున్నారని, నిజాయితీగా ట్యాక్స్ కట్టడమేనా తాను చేసిన తప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్స్ ప్రకారం నడుచుకోవడమేనా తాను చేసిన నేరం అని ప్రశ్నించారు.
‘‘భారతదేశంలో వ్యాపారం చేయడం కష్టమే.. ‘బిల్డింగ్ ఇన్ ఇండియా’ కల ఇక చాలు. కొత్త సంవత్సరంలో నేను ఈ దేశం విడిచి వెళ్లిపోదామని ప్లాన్ చేసుకున్న. వేరే దేశాల్లో ఎక్కడైనా నా వ్యాపారాన్ని విస్తరిస్త’’ అని రాసుకొచ్చారు. ‘‘ఈ వ్యవస్థ కరెక్ట్‌గా ఉండేవాళ్లను టార్గెట్ చేస్తూనే ఉంటుంది. మెజార్టీ ప్రజలను మెప్పించడానికే పనిచేస్తుంది. పద్ధతిగా, టైమ్‌కు పన్నులు కట్టేవాళ్లను అనుమానిస్తూనే ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. ఇది దేశభక్తికి సంబంధించిన అంశం కాదనీ, రియాలిటీని తాను ప్రస్తావిస్తున్నానని పేర్కొన్నారు.
