అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలు టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగుతున్నట్లు లోకో పైలట్ గమనించి వెంటనే రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది B1 కోచ్‌లో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత రైల్వే సిబ్బంది రైలులోని మిగిలిన కోచ్‌లను వేరు చేశారు.
ఎలమంచిలి స్టేషన్‌లో రైలు ఆగగానే, ప్రయాణికులు భయంతో రైలు దిగేసి బయటకు పరుగులు తీశారు. M1, B2 ఈ రెండు బోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలకు కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ ఘటనతో.. విశాఖ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరి తిరుపతి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఫలక్ నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే సూచించింది.
