జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నామినేషన్ లో సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డిసెంబర్ 29న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాకుండా ప్రచారంలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని.. నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.
దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్ యాదవ్ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్.. డిసెంబర్ 29న తొలిసారిగా అసెంబ్లీకి హాజరై నియోజకవర్గ ప్రజా సమస్యలపై గళం విప్పారు.
►ALSO READ | హైదరాబాద్ సనత్ నగర్ లో మహిళ హత్య కేసు...14 ఏళ్ల తర్వాత హంతకుడికి మరణశిక్ష విధించిన కోర్టు
2009లో యూసుఫ్‌గూడ డివిజన్లో ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నవీన్ యాదవ్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆయన 41,656 ఓట్లు (25.19 శాతం) సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు.
మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు ఆయన 18 వేల 817 ఓట్లు సాధించారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన ఆయన సతీమణి మాగంటి సునీతపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.
