రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డ్ స్థాయి టెంపరేచర్లతో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు పబ్లిక్. ఎండ వేడి, రోడ్లపై కాకతో పబ్లిక్ ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.  రాష్ట్రానికి ఇంకో మూడు రోజులు వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు  వాతావరణ శాఖ అధికారులు. 

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

కాగా, ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం నల్గొండ జిల్లాలోని మాడ్గులపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలను దాటింది. ఈ నెల 27న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  వాతావరణ శాఖ హెచ్చరించింది.