మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..

మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..

పీపీప్పీ.. డుండుం అంటూ సందడి చేసే డోలు, సన్నాయిలు. చప్పుడు చేయకుండా మూడు నెలల పాటు మూగపోనున్నాయి. ఇక మూడు నెలల వరకు పెళ్లి మంత్రాలు చదివే పురోహితులు మౌన వ్రతం చేపట్టాల్సిందే.. వంట మేస్త్రీ, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్‌ సిబ్బంది, లైటింగ్‌ డెకరేషన్‌ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్‌ వర్కర్లు, ప్రైవేటు కల్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. అదే విధంగా ఇప్పటివరకు కొనుగోలు దారులతో కళ కళ లాడిన బంగారం, వస్త్రదుకాణాలు వెలవెల బోయే పరిస్థితులు రానున్నాయి.

ఏప్రిల్‌ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో ముహుర్తాలు లేవని పండితులు వెల్లడించారు.దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది.   సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది. వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు.ఏప్రిల్​ 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు ఉండవని వివరిస్తున్నారు. దీనివల్ల వివాహాలతోపాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యంకాదని తెలియజేస్తున్నారు.

సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని పేర్కొంటున్నారు.

వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 28వ తేదీ చైత్ర బహుళ చవితి ఆదివారం నాటి   నుంచి .. జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది. అలాగే గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం ...నుంచి... జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగనుంది. గురు, శుక్ర మూఢాల్లో నూతన శుభకార్యక్రమాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు...  ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. 

మూఢం అంటే ఏమిటి..

 పురాణాల్లో గ్రహాలు, వాటి సంచారానికి అధిక ప్రాధ్యానత ఉంది. మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలంకాని సమయాన్ని సూచిస్తుందట. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారట. ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూఢాలు రెండు రకాలు గురు మూఢం, శుక్ర మూఢం.

గురు మూఢమి/శుక్ర మూఢమి:

 గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే.. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే.. ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదని పండితులు చెబుతున్నారు.

మూఢాల్లో చేయకూడని పనులు:

  • శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి, మూఢాల్లో వివాహాది శుభ కార్యాలు జరపకూడదని పండితులు చెబుతున్నారు.
  • లగ్నపత్రిక రాసుకోకూడదని, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదని అంటున్నారు.
  • పుట్టు వెంట్రుకలు తీయించడం, గృహ శంకుస్థాపనలు వంటి పనులు చేయకూడదని, అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని అంటున్నారు.

మూఢాల్లో ఇవి చేయొచ్చు

మూఢాల్లోనూ కొన్ని పనులు చేయవచ్చట. అవేటంటే..

  • అన్న ప్రాసన, ప్రయాణాలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
  • ఇంటి రిపేర్లు చేసుకోవడం, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం వంటి పనులు కూడా చేయొచ్చని అంటున్నారు.
  • నూతన ఉద్యోగాల్లో చేరడం, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయొచ్చని చెబుతున్నారు.మూఢంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది?: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న దాని ప్రకారం.. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభం వినాల్సి రావొచ్చని అంటున్నారు. ఏదైనా కష్టం కలగొచ్చని, ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అందుకే.. మూఢం సమయంలో ఏ శుభకార్యమూ తలపెట్టకూడదని అంటుంటారు.

మూఢాలు, ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరువ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూపనుంది. వారి వ్యాపారం మందగించనుంది. అలాగే బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు మందగించనున్నాయి. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులకు ఆశించిన గిరాకీ లేక ఉసూరుమనే పరిస్థితి నెలకొనడంతో వారికి మూడు నెలలు కష్టాలు తప్పవంటున్నారు.