ఎంసీసీ ఉత్తర్వులను పట్టించుకోని కాళోజీ

 ఎంసీసీ ఉత్తర్వులను పట్టించుకోని కాళోజీ
  • నష్టపోతున్న మెరిట్ ర్యాంకర్లు
  • లాస్ట్ రౌండ్ రద్దు చేయాలన్న బాధితులు
  • మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తీరుతో మెడికల్ పీజీ చేయాలనుకున్న స్టూడెంట్ల భవిష్యత్ గందరగోళంలో పడింది. నీట్‌‌‌‌లో మంచి ర్యాంకులు సాధించిన సుమారు 50 మంది స్టూడెంట్లకు సీట్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌రావుకు బాధితులు మొర పెట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా స్టేట్‌‌‌‌ కోటా మాప్‌‌‌‌ అప్‌‌‌‌ (చివరి) రౌండ్ ను రద్దు చేయాలని వారు కోరారు. లేకపోతే మాప్‌‌‌‌ అప్‌‌‌‌ రౌండ్‌‌‌‌ లిస్టును ఎంసీసీకి సమర్పించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి సూచనల మేరకు కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని బాధితులు కలిశారు. కౌన్సెలింగ్ ముగిసినందున క్యాన్సిల్ చేయడం కుదరదని వీసీ వారికి స్పష్టం చేశారు. మాప్‌‌‌‌ అప్ రౌండ్ లిస్ట్ ను ఎంసీసీకి పంపడం కూడా వీలుకాదని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఏంచేయాల్నో తోచక మెరిట్ ర్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి వీళ్లందరికీ ఆలిండియా కోటా మాప్‌‌‌‌ అప్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో మంచి కాలేజీల్లో సీట్లు వచ్చాయి. అంతకుముందు జరిగిన స్టేట్ కోటా సెకండ్ రౌండ్‌‌‌‌లో కూడా సీట్లు వచ్చినా, ఆలిండియా కోటాలో ఇంకా మంచి కాలేజీల్లో సీట్లు రావడంతో స్టేట్ కోటా సెకండ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో వచ్చిన సీట్లను వదిలేసుకున్నారు. కానీ, ఆలిండియా కోటా మాప్‌‌‌‌ అప్ రౌండ్‌‌‌‌ను సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయడం, కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎంసీసీ ఇచ్చిన ఉత్తర్వులను వర్సిటీ అమలు చేయకపోవడంతో వీళ్లంతా ఇబ్బందుల్లో పడ్డారు. 
ఇదీ జరిగింది.. 
మెడికల్ పీజీ సీట్లలో సగం సీట్లను ఆలిండియా కోటా, సగం సీట్లను స్టేట్ కోటాలో భర్తీ చేస్తారు. ఆలిండియా కోటా సీట్లకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఎంసీసీ రూల్స్‌‌‌‌ ప్రకారం ఆలిండియా కోటా చివరి రౌండ్ (మాప్‌‌‌‌ అప్‌‌‌‌ రౌండ్) కౌన్సెలింగ్ తర్వాతే, స్టేట్‌‌‌‌ కోటా చివరి రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఈసారీ అలాగే చేశారు.కానీ, ఆలిండియా కోటా మాప్‌‌‌‌ రౌండ్‌‌‌‌ విషయంలో కొంత మంది స్టూడెంట్స్‌‌‌‌ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, ఆ రౌండ్‌‌‌‌ను కోర్టు రద్దు చేసింది. కోర్టు ఆదేశాలతో ఆ రౌండ్‌‌‌‌ను రద్దు చేస్తూ ఎంసీసీ ఉత్తర్వులిచ్చింది. మాప్‌‌‌‌ అప్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు ముందు జరిగిన రౌండ్‌‌‌‌(స్టేట్ లేదా సెంట్రల్ కోటా సెకండ్ రౌండ్‌‌‌‌)లో ఏ కాలేజీలో సీటు వస్తే, ఆ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని ఎంసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ తర్వాత మరోసారి మాప్‌‌‌‌అప్‌‌‌‌ రౌండ్ నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే, ఈ సారి నిర్వహించబోయే మాప్‌‌‌‌అప్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు స్టేట్ సెకండ్ రౌండ్ లేదా ఆలిండియా సెకండ్ రౌండ్​లో సీటు వచ్చి ఆయా కాలేజీల్లో చేరిన స్టూడెంట్లకు ఆలిండియా కోటా చివరి రౌండ్(మళ్లీ నిర్వహించబోయే) కౌన్సెలింగ్‌‌‌‌లో పాల్గొనడానికి వీల్లేదని ఎంసీసీ కండీషన్ పెట్టింది. తమ మాప్‌‌‌‌అప్‌‌‌‌ రౌండ్ తర్వాత, స్టేట్‌‌‌‌ మాప్‌‌‌‌అప్‌‌‌‌ రౌండ్ నిర్వహించుకోవాలని సూచించింది. 
లైట్ తీసుకున్న కాళోజీ వర్సిటీ 
కోర్టు తీర్పు, ఎంసీసీ ఉత్తర్వుల ప్రకారం పలు రాష్ట్రాలు స్టేట్ కోటా మాప్‌‌‌‌ అప్ కౌన్సెలింగ్‌‌‌‌ను రద్దు చేశాయి. కానీ, మన వర్సిటీ రద్దు చేయలేదని స్టూడెంట్లు చెబుతున్నారు. ఎంసీసీ రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా మాప్‌‌‌‌ అప్‌‌‌‌ రౌండ్​ను ముందే నిర్వహించినట్టు తెలిసిపోతుందని, దీని వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని వీసీ అన్నట్టుగా స్టూడెంట్లు చెబుతున్నారు. 
రిజెక్ట్ అయితే సీట్లు రానట్లే.. 
ప్రస్తుతం ఆలిండియా కోటా మాప్‌‌‌‌అప్‌‌‌‌ కౌన్సెలింగ్ జరుగుతోంది. సెకండ్ రౌండ్‌‌‌‌లో సీట్లు వచ్చిన వారు ఎలిజిబుల్ కాదని ఎంసీసీ పేర్కొన్నప్పటికీ, దిక్కులేని పరిస్థితుల్లో ఈ కౌన్సెలింగ్‌‌‌‌కూ మన స్టూడెంట్లు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఒకవేళ స్క్రుటినీలో మన స్టూడెంట్లను ఎంసీసీ రిజెక్ట్ చేస్తే, వారికి సీట్లు వచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే మన స్టేట్ కోటాకు సంబంధించిన కౌన్సెలింగ్​ను వర్సిటీ ఇప్పటికే ముగించేసింది. అందుకే హెల్త్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ను కలిసి, తమను ఆదుకోవాలని బాధిత స్టూడెంట్లు విజ్ఞప్తి చేశారు.