కామారెడ్డి జిల్లా బార్డర్ బంద్

కామారెడ్డి జిల్లా బార్డర్ బంద్
  • ఇందూరులోపెరుగుతున్న కేసులతోమరింత అలర్ట్
  •  నిజామాబాద్ లో 47, కామారెడ్డిలో10పాజిటివ్ కేసులు
  •  కరోనా కట్టడికి రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిపివేత

కరోనా వైరస్ నియంత్రణ కోసం నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలో ఇప్పటికే లాక్డౌన్ కొనసాగుతోంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నిత్యావసర వస్తువుల షాపులు కూడా కొన్ని గంటలు మాత్రమే తెరచి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. బుధవారం నాటికి నిజామాబాద్ జిల్లాలో 47, కామారెడ్డి జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు, బోధన్, ఆర్మూర్, మాక్లూర్, తదితర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు బయట పడగా, కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పట్టణంలో తొమ్మిది, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదైంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు.

 రెండు జిల్లాల మధ్య రాకపోకలపై ఆంక్షలు..

నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా బయట పడుతున్న దృష్ట్యా పక్కనే ఉన్నా కామారెడ్డి జిల్లా ఆఫీసర్లు రాకపోకల విషయంలో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో, మహారాష్ర్ట మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నుంచి చెక్ పోస్టుల వద్ద సిబ్బందిని పెంచి తనిఖీలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వైపు నుంచి కామారెడ్డి జిల్లాకు వచ్చే అన్ని రోడ్లను బంద్ చేశారు. నిత్యావసర సరుకులు, అత్యవసరం ఉన్నవారికి మాత్రమే తనిఖీ చేసి అనుమతి ఇస్తున్నారు. కరోనా అదుపులోకి వచ్చేంత వరకు ఇరు జిల్లాల ప్రజలు ఇందుకు సహకరించాలని ఆఫీసర్లు కోరుతున్నారు.

 కొందరికి తాత్కాలిక వసతిపై దృష్టి

కామారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించే ఆయా శాఖల ఆఫీసర్లు, సిబ్బంది నిజామాబాద్ జిల్లా నుంచి 250 మంది వరకు రాకపోకలు సాగిస్తారు. వీరంతా కామారెడ్డి జిల్లాలోనే స్థానికంగా ఉండాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికిప్పుడు మకాం మార్చడం ఇబ్బంది కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజుల పాటు వారికి తాత్కాలిక వసతి కల్పించే అంశాన్ని ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు.