ఖాట్మండు: నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కామీ రీటా షెర్పా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని 32వ సారి అధిరోహించారు. తన పేరిట ఉన్న పాత రికార్డును తానే బద్దలు కొట్టారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది. 56 ఏండ్ల వయసున్న షెర్పా ఆదివారం ఉదయం 10:12 గంటలకు 8,849 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకున్నారు.
14 పీక్స్ ఎక్స్‌పెడిషన్ సంస్థ ఆధ్వర్యంలో వెళ్లిన పర్వతారోహణ బృందానికి అతనే నాయకత్వం వహించారు. జనవరి 1970లో కోషి ప్రావిన్స్‌లోని సోలుఖుంబు జిల్లాలో జన్మించిన కామీ రీటా, 1992లో ప్రొఫెషనల్ పర్వతారోహకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994లో మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగా, గతేడాది (మే 27, 2025న) 31వ సారి ఈ ఘనత సాధించారు.
'మౌంటైన్ క్వీన్' లక్పా షెర్పా మరో రికార్డు..
'మౌంటైన్ క్వీన్' గా గుర్తింపు పొందిన లక్పా షెర్పా కూడా సరికొత్త రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి నేపాలీ మహిళగా గుర్తింపు పొందారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు 11వ సారి ఆమె విజయవంతంగా శిఖరాన్ని చేరుకుని మహిళా విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.
