ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టారు: ప్రభుత్వ విప్‌

ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టారు: ప్రభుత్వ విప్‌

ప్రతిపక్షాలపై కర్నె ప్రభాకర్‌ ఫైర్‌

హైదరాబాద్‌, వెలుగు: ఆర్టీసీ కార్మికులను ప్రతిపక్ష పార్టీలే రెచ్చగొట్టాయని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. శుక్ర వారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం ఉదారంగా వ్యవహరిం చారని అందరూ ప్రశంసిస్తుంటే బీజేపీ రాష్ట్ర చీఫ్​ లక్ష్మణ్‌ చవకబారు విమర్శ లు చేస్తున్నారని అన్నారు. కేంద్రం జోక్యంతో సీఎం స్పందించారనడం సరికాదన్నారు. ఆర్టీసీని ఆదుకునేందుకు కేంద్రం సాయంచేసి ఉంటే లక్ష్మణ్‌ చెప్పే మాటలను ప్రజలు నమ్మేవారని అన్నారు.  ఆర్టీసీ నష్టాలను పంచుకోలేమని గడ్కరీని రాష్ట్ర నాయకులతో చెప్పిన విషయం పత్రికల్లో వచ్చిందన్నారు. కేంద్రం, చట్టం ఒకటి చెప్తుంటే అందుకు విరుద్ధంగా లక్ష్మణ్ ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే లక్ష్మణ్‌కు అది సర్జికల్‌ స్ట్రయిక్‌లా కనిపించిందని, ఆయన వ్యాఖ్యలకు సొంత పార్టీ కార్యకర్తలే నవ్వుకున్నారని అన్నారు. దీక్షా దివస్‌ రోజే 52 రోజుల ఆర్టీసీ సమ్మెకు తెరపడిందని, కేసీఆర్‌ ఏం చేసినా తెలంగాణ హితం కోసమే చేస్తారని మరోసారి రుజువయ్యిందని కర్నె అన్నారు.

karne prabhakar alleged that opposition parties were provoking RTC workers.