Karuppu: ఇళయరాజా కాపీరైట్ డైలాగ్ రచ్చ.. క్షమాపణలు చెప్పి సీన్ తొలగించిన మేకర్స్

Karuppu: ఇళయరాజా కాపీరైట్ డైలాగ్ రచ్చ.. క్షమాపణలు చెప్పి సీన్ తొలగించిన మేకర్స్

సినీ చరిత్రలో ఇళయరాజా (Ilaiyaraaja) పేరు ఎంతో ప్రత్యేకం. మ్యూజిక్ మేస్ట్రో, ఇసైజ్ఞాని వంటి బిరుదులతో కీర్తించబడుతున్న సంగీత విద్వాంసుడు 'ఇళయరాజా' శైలి అందరిలో వినూత్నం. దాదాపు 50 ఏళ్లుగా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆయన, పాటల కాపీరైట్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన పోరాటాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘కరుప్పు’ మేకర్స్ ఇళయరాజాకు సంబంధించిన ఓ వివాదంపై అధికారికంగా క్షమాపణలు తెలిపారు.

ఇళయరాజా కాపీరైట్ డైలాగ్ రచ్చ..

మే15న థియేటర్లోకి వచ్చిన ‘కరుప్పు’ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. తమిళ వెర్షన్ కరుప్పులోని ఓ సన్నివేశంలో బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్ కాంత్ మూవీ నుంచి పాట వినిపిస్తుంది. ఆ సమయంలో పాటల కాపీరైట్ హక్కులకు సంబంధించిన డైలాగ్స్ పరోక్షంగా ఇళయరాజాను లక్ష్యంగా చేసుకుని, ఆయనను కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇళయరాజా ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ‘కరుప్పు’ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఇళయరాజా మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అలాగే వివాదాస్పద సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు  వెల్లడించారు.

“కరుప్పు సినిమాలో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగ్ వల్ల ఇళయరాజా గారు బాధపడ్డారని మా దృష్టికి వచ్చింది. ఆయనపై మాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన సేవలను లేదా ఆయన హక్కులను అవమానించడం, బాధపెట్టడం, అగౌరవపరచడం మా ఉద్దేశం కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశించిన అన్ని డైలాగులను వెంటనే తొలగిస్తున్నాం. ఇళయరాజా గౌరవమే మాకు ముఖ్యం. వ్యక్తిగతంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని రాసుకున్న సన్నివేశం కాదని” చిత్ర బృందం స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. అయితే ఇలాంటి అంశాల్లో ముందుగానే మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

‘కరుప్పు’ కలెక్షన్స్:

సూర్య లాంగ్ గ్యాప్ తర్వాత ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంతో సత్తా చాటుతున్నారు. ఈ చిత్రం కేవలం మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.147 కోట్లను వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఇప్పుడు రూ.150 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష నటించడంతో సినిమాకు భారీ ప్లస్ అయింది. ఈ వారం వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.