జెన్ జీ రాజకీయాల్లోకి రావాలి : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

జెన్ జీ రాజకీయాల్లోకి రావాలి : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత
  •     తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే పార్టీ ఏర్పాటు చేశా 
  •     ఉద్యమ కేసీఆర్​తో నాకు ఏ సమస్యా లేదు
  •     సీఎంగా, బీఆర్ఎస్​ చీఫ్​గానే నాకు సమస్య : వే 2 న్యూస్​ కాన్​క్లేవ్​లో టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత కామెంట్స్​​ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేశాననే పేరు చరిత్రలో తనకంటూ ఉండాలన్నదే తన ఆశయమని తెలంగాణ రక్షణ సేన (టీఆర్​ఎస్) అధ్యక్షురాలు కవిత అన్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. లిక్కర్​ స్కామ్ పేరుతో బీజేపీ తనను, కేజ్రీవాల్​ను బద్నాం చేయాలని చూసిందన్నారు. కానీ, కోర్టు ఆ ఆరోపణలను డిస్మిస్ చేసిందని గుర్తు చేశారు. లిక్కర్​ స్కామ్​ కేసు అంశం వచ్చినప్పుడు పుట్టింటి తరఫు నుంచి తనకు సరైన సపోర్ట్​ రాలేదని.. తన మెట్టినింటి వాళ్లే ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. శుక్రవారం ప్రముఖ వార్తాసంస్థ వే 2 న్యూస్​నిర్వహించిన కాన్​క్లేవ్​లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్యమ కేసీఆర్​తో తనకు సమస్య లేదని కవిత చెప్పారు. కానీ, సీఎంగా, బీఆర్​ఎస్​ చీఫ్​గానే కేసీఆర్​తో తనతో పాటు చాలా మందికి సమస్య వచ్చిందని పేర్కొన్నారు. 

‘‘బీఆర్​ఎస్​లో నేను మాత్రమే డిఫరెంట్​గా నా అభిప్రాయం చెప్పేది. కానీ, నేను అంతర్గతంగా చెప్పిన అభిప్రాయాలను బయటకు వచ్చేలా చేశారు. దీంతో నేనే స్వయంగా నా అభిప్రాయాలను బయటకు చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు. అప్పటి నుంచి నేను ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అనుకొనే పార్టీ పెట్టాను. చుక్క రక్తం చిందించకుండా రాజ్యాంగం ద్వారా దేశంలో మార్పు తెస్తానని అంబేడ్కర్  అన్నారు. అదే విధంగా నేను కూడా రాజకీయ పార్టీ ద్వారా మంచి మార్పు తేవాలని వచ్చాను. ఆడపిల్లలు రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అయితే వారికి ఏమీ చేతకాదని ముద్ర వేస్తారు. అందుకే కచ్చితంగా సక్సెస్ కావాలని నేను మంచి స్ట్రాటజిస్ తో ముందుకు వెళ్తున్నా’’ అని ఆమె చెప్పారు. 

జెన్​ జీ తలుచుకుంటే ఏమైనా చేయగలరు..

జెన్ జీ తరం వాళ్లు తలచుకుంటే ఏమైనా చేయగలరని కవిత అన్నారు. ప్రభుత్వాన్ని కూడా పడేయగలరన్నది నేపాల్ లో చూశామన్నారు.  జెన్​జీ, మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నారు. రాజకీయ నాయకులు ఏం చేసినా వాళ్లు అవినీతిపరులే అన్నట్టుగా చూపిస్తున్నారని.. కానీ, ఫండమెంటల్ గా నాయకులెవరూ అవినీతిపరులు కారని చెప్పారు. ఈ దేశంలో ఏ పెద్ద మార్పు వచ్చినా అది రాజకీయ పార్టీల కృషి కారణంగానే వచ్చిందన్నారు. ప్రజాస్వామికంగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఉండాలని, భిన్నమైన అభిప్రాయాలను తీసుకోవాలని తెలిపారు. 

కానీ, దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ముందుగా ప్రాంతీయ వాదం తర్వాత జాతీయ వాదం ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కాగా, బండి సంజయ్  కుమారుడి మీద వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో తెలంగాణ మహిళలు గమనిస్తున్నారని కవిత అన్నారు. నాన్ బెయిల్ సెక్షన్లు ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ కు రేవంత్ రెడ్డి మేలు చేసి పెడుతున్నారని తెలిపారు. సంజయ్​ తొలుత తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయన పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదని అన్నారు. విచారణ పూర్తయ్యేదాకా సంజయ్​ను పదవి నుంచి తప్పించాల్సిందిగా ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు.