హుజురాబాద్:TRS అభ్యర్ధి కోసం కేసీఆర్ కసరత్తు

హుజురాబాద్:TRS అభ్యర్ధి కోసం కేసీఆర్ కసరత్తు

అసైన్డ్ భూముల ఆరోపణల తర్వాత ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడం,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో హుజురాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. దాదాపు 2 దశబ్దాల పాటు హుజురాబాద్ లో తిరుగులేని నేతగా ఉన్న ఈటల వంటి బలమైన నేతను తట్టుకుని గెలిచే సత్తా ఉన్న లీడర్ కోసం గులాబీ బాస్ కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు.  ఈటల స్థానాన్న భర్తీ చేయగల సత్తా ఎవరికుందనే కోణంలో ఒకటికి రెండుసార్లు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నా.. ఏ పేరు దగ్గరా ఆయన సంతృప్తి చెందడం లేదని తెలుస్తోంది. ఈటల రాజేందర్ ది  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కావడం. ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం, కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు సరన నిలబడిన నేతగా ఎదగడంతో అంతటి లీడర్ ను ఢీ కొట్టాలంటే ఎవరైతే సరిపోతారన్న విషయంలో ఇంకా కన్ క్లూజన్ కు రాలేకపోతున్నారు.

హుజురాబాద్ లో గులాబీ పార్టీ తరపున బరిలోకి దింపేందుకు ఇప్పటికే అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. వీరిలో ఎక్కవగా వినిపిస్తోన్న పేరు మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్. ఈయనను పోటీలో నిలపాలన్న ప్రతిపాదన జిల్లా నేతల ద్వారా సీఎం కేసీఆర్ కు మొదట్లోనే వెళ్లింది. హుజూరాబాద్  నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులతో ప్రయోగాలు చేసే కంటే ఈటలను ఢీకొనేందుకు దీటైన అభ్యర్థినే రంగంలోకి దింపాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ , బీజేపీల నుంచి టీఆర్ ఎస్ లో చేరి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వలస అభ్యర్థుల కంటే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్  పోటీ చేస్తేనే  బాగుంటుందని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో హుజురాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండేది. 

వినోద్ కుమార్  హన్మంకొండ ఎంపీ గా గెలుపొందిన సమయంలోనూ ప్రస్తుత ఈటల స్వస్థలమైన కమలాపూర్  అప్పట్లో హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. నియోజకవర్గ పునర్విభజన తర్వాత కమలాపూర్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఈ విధంగా ఆయన ఇక్కడి ప్రజలకు పరిచయమైన వ్యక్తి కావడంతో వినోద్ కుమార్ పేరుపైనే అధిష్ఠానం కూడా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.  ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు, నేతలతో సంబంధాలు ఉన్న వినోద్ కుమార్ ..  ఈటల రాజేందర్ కు దీటైన అభ్యర్థి అవుతాడని టీఆర్ ఎస్  అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా, ఆర్థికంగా,  వ్యూహపరంగా వినోద్ కుమార్  ఈటలకు సమ ఉజ్జీగా ఉంటారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే హుజురాబాద్ నుంచి పోటీ చేయడానికి వినోద్ కుమార్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఈటలపై ఓడితే తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందంని  ఆయన పోటీకి భయపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రెండు నెలలుగా టీఆర్ఎస్ నేతలు చాలామంది ఇక్కడ పర్యటిస్తున్నా.. వినోద్ కుమార్ ఇటువైపు రాలేదు. 

వినోద్ కుమార్ కాదంటే.. ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబంలో నుంచి ఒకరిని రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న ఆప్షన్ ను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు లక్ష్మికాంతరావు భార్య సరోజనతోపాటు, కెప్టెన్ మనవడు ప్రణవ్ పేరు సీఎం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుటుంబం నుంచి పరిశీలిస్తున్న ఈ ఇద్దరు కూడా పోటీకి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.  కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2004లో హుజురాబాద్ ఎమ్మెల్యే గా కెప్టెన్ లక్ష్మీకాంతరావు పనిచేశారు. కెప్టెన్ సతీమణి సరోజ రాజకీయాల్లోనే ఉంటూ... గతంలో హుజురాబాద్ ఎంపీపీగా పనిచేశారు. దీంతో.. ఈ కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తామని కెప్టెన్ లక్ష్మీకాంతరావు గతంలో ప్రకటించారు. మళ్లీ పోటీ పట్ల వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. లక్ష్మికంతరావు  రాజ్యసభ సభ్యునిగా, కొడుకు సతీశ్ కుమార్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరొకరికి టికెట్ ఇస్తే కుటుంబ పాలన అంటారేమోనన్న భయం టీఆర్ఎస్ పార్టీ నేతలను వెంటాడుతున్నట్లు ప్రచారంలో ఉంది. జమ్మికుంట మున్సిపల్ ఛైర్ పర్సన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ను అభ్యర్థిగా ఖరారు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే  వెలమ సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో  ఆపేరును రిజర్వులో ఉంచినట్లు తెలుస్తోంది.
 
బోయిన్ పల్లి వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం కాకుండా… ఇటీవల మరికొన్ని పేర్లు హుజురాబాద్ క్యాండిడెట్లుగా పరిశీలనకు వచ్చాయి. నియోజకవర్గంలోని వీణవంక మండలం మామిడాల పల్లి గ్రామానికి చెందిన మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడైన మాజీ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు ఇప్పుడు బాగా ప్రచారం ఉంది. . కమలాపూర్ నియోజకవర్గం రద్దు కాకముందు ఇక్కడి నుంచి నాలుగుసార్లు ముద్దసాని దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయనకు నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది.  సోదరుని కరిష్మాతో పాటు... ఇంటలెక్చువల్ గా, మాజీ ఐఏఎస్ అధికారిగా పురషోత్తం రెడ్డికి ఉన్న క్రెడిబులిటీ కలిసి వస్తుందన్న కోణంలో ఈయన పేరును టీఆర్ఎస్ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకైన కశ్యప్ రెడ్డి ఇటీవల హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరడం, పురుషోత్తం రెడ్డి ఎన్నడూ లేనిది నియోజకవర్గానికి వచ్చి ఇక్కడి ఇల్లందకుంట ఆలయంలో పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెడ్డి సామాజికి వర్గానికి చెందిన ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.

బీసీలో బలమైన నేతగా పేరున్న ఈటల రాజేందర్ ను ఢీకొట్టాలంటే మరో బీసీ నేతను రంగంలోకి దించాలన్న ప్రయత్నాలను గులాబీ పార్టీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరి కింద తెలంగాణ ఉద్యమకారుడు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అరుకాల వీరేశం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈయన ఉద్యమసమయంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు.. ఈటలను మొదటి నుంచి విబేధిస్తున్న వ్యక్తి కావడం, నియోజకవర్గంలో పద్మశాలీల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వీరేశం పేరు పరిశీలనలోకి వచ్చిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. విద్యార్థి నేతగా, యూత్ నేతగా ఫాలోయింగ్ ఉండటం, గొల్ల, కుర్మ, యాదవ కులస్థుల ఓట్లు టర్న్ అవుతాయన్న ఆలోచనతో శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ  చేసిన, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణ కృష్ణ మోహన్ పేరును బీసీ కేటగిరిలో పరిశలిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ వాళ్లు కాకుండా.. బయట పార్టీలకు చెందిన కొందరి పేర్లు సీఎం కేసీఆర్ పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా పనిచేసిన నేత అని సమాచారం. మరో పార్టీకి చెందిన యువ నేతను పార్టీలోకి ఆహ్వానించాలని కూడా గులాబీ పార్టీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలో ఈటలకు గట్టి పోటీ ఇచ్చి భారీ ఓట్లు సాధించిన ఆ యువనేతను బరిలోకి దింపాలని స్థానిక టీఆర్ఎస్ నేతల నుంచి కేసీఆర్ కు విజ్ఞప్తులు వెళ్లాయి. దూకుడుగా ఉండే ఆ నేత వల్ల.. ఈటలకు మరింత సానుభూతి వస్తుందేమోనన్న భయంతో వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

ఇలా ఇప్పటికే అనేక పేర్లు పరిశీలించిన కేసీఆర్... తన ముందుకు వచ్చిన లిస్టులోని ఏ పేరుకు టిక్ మార్క్ వేయలేదని తెలుస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తానే అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ కూడా నియోజకవర్గంలో మంత్రులను, ఎమ్మెల్యేలను బరిలోకి దింపి అన్ని రకాల ప్రచారాలు చేస్తున్నా.. అభ్యర్థి లేని లోటు వారిని వేధిస్తోంది. దీంతో..త్వరలోనే ఓ అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం.