SRH Vs LSG: తడిసి ముద్దైన ఉప్పల్ స్టేడియం.. సన్ రైజర్స్ vs లక్నో మ్యాచ్ జరిగే అవకాశం ఎంత..?

 SRH Vs LSG: తడిసి ముద్దైన ఉప్పల్ స్టేడియం.. సన్ రైజర్స్ vs లక్నో మ్యాచ్ జరిగే అవకాశం ఎంత..?

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు (మే 8) బిగ్ మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జయింట్స్ తో పోరుకు సిద్ధమైంది.  ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. ప్లే ఆఫ్ కు దగ్గరగా వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. అయితే రెండు జట్లను వరుణుడు బయపెడుతున్నాడు. హైదరాబాద్ లో మంగళవారం (మే 7) కుండపోతగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వరుణుడు విజృంభించడంతో ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. 

హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. అక్యూవెదర్ ప్రకారం  మే 8 (బుధవారం) సాయంత్రం 40 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు  అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి కాసేపటికి ఆగితే ఓవర్లు కుదించి మ్యాచ్ ను నిర్వహిస్తారు. వర్షం వలన మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇస్తారు.   

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  లక్నో ఆటగాళ్ల మంగళవారం (మే 7) ప్రాక్టీస్ చేస్తున్నసమయంలో చిరు జల్లులు కురిశాయి. దీంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ ఆపేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంత సేపటికీ భారీ వర్షం కురవడంతో గ్రౌండ్ అంతటా కవర్స్ కప్పి ఉంచారు. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. రెండు జట్లు కూడా ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి రేస్ లో ఉన్నాయి.