కేరళ సీఎంగా  సతీశన్‌‌‌‌ ప్రమాణం ...తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో కార్యక్రమం

కేరళ సీఎంగా  సతీశన్‌‌‌‌ ప్రమాణం ...తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో కార్యక్రమం
  • హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక, సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్  అర్లేకర్
  • కొలువుదీరిన కొత్త కేబినెట్‌‌‌‌.. 14 మంది కొత్త వారికి అవకాశం  
  •  కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా..
  • తొలి కేబినెట్‌‌‌‌ భేటీలో మహిళలకు ఫ్రీ బస్సు, ఆశావర్కర్ల గౌరవ వేతనం పెంపు 
  •  దశాబ్దం తర్వాత అధికారం చేపట్టిన యూడీఎఫ్

తిరువనంతపురం: కేరళలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని యునైటెడ్‌‌ డెమొక్రటిక్‌‌ ఫ్రంట్‌‌ (యూడీఎఫ్‌‌)ను అధికారంలోకి తెచ్చిన వీడీ సతీశన్‌‌ సీఎంగా ప్రమాణం చేశారు. సోమవారం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జనసందోహం, హోరెత్తిన నినాదాల మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

సతీశన్‌‌తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్  ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు 20 మంది సభ్యులు ప్రమాణం చేయగా.. కొత్త కేబినెట్‌‌ కొలువుదీరింది. ఇందులో సీనియర్ నేత రమేశ్‌‌ చెన్నితాలతోపాటు 14 మంది కొత్త వారికి చోటు దక్కింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్‌‌ పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌‌రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్‌‌ సింగ్‌‌ సుఖు, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌, కేసీ వేణుగోపాల్‌‌తోపాటు కూటమి భాగస్వామ్య పక్షాలైన ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ నేతలు హాజరయ్యారు. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ ఏకంగా 102 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్​ మీటింగ్‌‌లోనే రాహుల్ ‘గ్యారంటీల’ అమలు

ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సెక్రటేరియట్‌‌లో సీఎం సతీశన్ అధ్యక్షతన తొలి కేబినెట్‌‌ భేటీ జరిగింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇచ్చిన 5 ముఖ్యమైన గ్యారంటీలపై ఈ మీటింగ్‌‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 15 నుంచి కేరళ ఆర్టీసీ (కేఎస్‌‌ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించేందుకు కేబినెట్‌‌ ఆమోదం తెలిపింది.

దేశంలోనే మొదటిసారిగా వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘‘సమాజం వృద్ధులను ఎలా చూసుకుంటుందనే దానిపైనే ఆ సమాజ నాగరికత ఆధారపడి ఉంటుంది. కేరళను ఒక ఆదర్శవంతమైన సమాజంగా మారుస్తాం’’ అని ఈ సందర్భంగా వీడీ సతీశన్‌‌ వ్యాఖ్యానించారు. అలాగే, ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 3 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి మొత్తం వేతనం రూ.12 వేలకు చేరనున్నది. అంగన్‌‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, స్కూల్ వంట సిబ్బంది, ప్రీ- ప్రైమరీ టీచర్లు, ఆయాల జీతాలను కూడా నెలకు రూ. వెయ్యి చొప్పున పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు.

మేనిఫెస్టోలోని మిగిలిన హామీలైన.. విద్యార్థినులకు రూ. వెయ్యి స్టైపెండ్, సంక్షేమ పెన్షన్ రూ. 3 వేలకు పెంపు, రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, యువతకు రూ. 5 లక్షల వడ్డీ లేని రుణాలను దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఖజానాపై వైట్​పేపర్‌‌‌‌

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న సతీశన్.. దీనిపై త్వరలోనే శ్వేతపత్రం  విడుదల చేస్తామన్నారు. అలాగే, మే 21, 22 తేదీల్లో కొత్త అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక పూర్తి చేయాలని గవర్నర్‌‌కు సిఫార్సు చేశారు. సీనియర్ ఎమ్మెల్యే జీ సుధాకరన్‌‌ను ప్రొటెం స్పీకర్‌‌గా నియమించారు.

మే 29న గవర్నర్ పాలసీ ప్రసంగం ఉంటుంది. 2023లో అప్పటి సీఎం పినరయి విజయన్ గన్‌‌మెన్లు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై జరిపిన దాడి ఘటనపై తిరిగి దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌‌) ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది రాజకీయ కక్షసాధింపు కాదని, కోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నామని సీఎం సతీశన్ క్లారిటీ ఇచ్చారు.

ప్రధాని మోదీ అభినందనలు 

కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్‌‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందజేశారు. ‘‘కేరళ సీఎంగా ప్రమాణం చేసిన  వీడీ సతీశన్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. కేరళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో, రాష్ట్ర అభివృద్ధిలో నూతన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సాధ్యమైన అన్ని విధాలా సహకారం, మద్దతు అందిస్తాం” అని వ్యాఖ్యానించారు.

ప్రజా గొంతుకగా యూడీఎఫ్‌‌ ప్రభుత్వం: రాహుల్ గాంధీ

కూటమి విజయానికి కారకులైన కేరళ ప్రజలకు రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. ‘‘కేరళ ప్రజలు ఈ ప్రభుత్వం కోసం పోరాడారు. వారి గొంతుకే ఈ ప్రభుత్వానికి మార్గదర్శి. సీఎం సతీశన్‌‌కు, ఆయన కేబినెట్‌‌కు అభినందనలు. ఈ టీమ్ ప్రతి కేరళీయుడి ఆశయాలకు ప్రతీకగా నిలుస్తుంది” అని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు.