హైదరాబాద్: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణపతి కర్ర పూజకు ముహూర్తం ఖరారైంది. 2026, జూన్ 25 సాయంత్రం ఐదు గంటలకు బడా గణనాథుడి కర్ర పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సోమవారం (మే 18) ప్రకటించింది. దీంతో గణనాథుడి విగ్రహ నిర్మాణం ప్రారంభంకానుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతియేటా కర్ర పూజ కార్యక్రమం నిర్వహించిన తర్వాత విగ్రహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం సంప్రదాయం. ఈసారి కర్ర పూజకి వినాయక చవితికి మధ్య 80 రోజుల వ్యవధి ఉంది. ఈ 80 రోజుల వ్యవధిలో బడా గణనాథుడిని తయారు చేయనున్నారు. ఈసారి కూడా మట్టి విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
వినాయక చవితి తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు. గణేష్ చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహా గణపతి.. ఈ ఏడాది భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే జూన్ 25న ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు కర్ర పూజతో ప్రారంభించనున్నారు.
