ఖైరతాబాద్ గణేష్.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఖైరతాబాద్ గణేష్.. భారీగా తరలివచ్చిన భక్తులు

దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గల్లీ గల్లీలో వినాయక మంటపాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో వినాయక చవితి అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్. భారీ ఆకారంలో వినాయకుడు దర్శనమిస్తుంటాడు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. బడా గణేష్ ను చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మొదటి రోజే అమాంతం రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేసారి రావడంతో క్యూ లైన్ల బారిగేట్లను పోలీసులు తొలగించారు. ప్రత్యేక రోప్ ఏర్పాటు చేసి వెంటవెంటనే భక్తులను పంపించేస్తున్నారు. సాయంత్రం మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో ఈ సమయంలో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా.. మంగళవారం నుంచే భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనం ఇస్తున్నారు. ప్రత్యేకించి 50 అడుగుల మట్టి గణేష్ ను ఏర్పాటు చేశారు. గణనాథుడికి ఇరువైపులా త్రిశక్తి మహా గాయత్రి, షణ్ముఖ సుబ్రమణ్య స్వామి దర్శనమిస్తున్నారు. 

గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. వీరితో పాటు మహాగణనాథుడికి  మంత్రి తలసాని, ఎమ్యెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొని వినాయకుడికి మహా హారతి ఇచ్చారు. వీరితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం బడా గణేశ్ ని సందర్శించారు. అంతకుముందు ఈ ఖైరతాబాద్ వినాయకుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు. ఈ సారి 50 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి  వినాయకుడికి మొదటగా పద్మశాలి సంగం తరపున పట్టు వస్త్రాలు, గరికపూస, వెండి జంజాన్ని నిర్వాహకులు సమర్పించారు.