ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఫెయిల్ : కిషన్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఫెయిల్ : కిషన్ రెడ్డి
  • క్వింటాల్​కు కేంద్రం రూ.2,360 ఇస్తున్నా కొనుగోళ్లలో నిర్లక్ష్యం ఎందుకు?: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బస్తా నుంచి రవాణా వరకు, గిట్టుబాటు ధర నుంచి గోదాం అద్దె వరకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ,  రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఏడిపిస్తోందని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్  ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

తన అసమర్థతను దాచుకోవడానికి కేంద్రంపై నిందలు వేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపించారు. క్వింటాలుకు రూ.2,360 ఇస్తున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక పది పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్  ఇస్తామని చెప్పారని, తీరా చూస్తే సన్నవడ్లకు కూడా సగం మందికి ఇవ్వడం లేదన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఎదురుదాడి చేయడానికే టైం కేటాయిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏసీ గదుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదని, మంత్రులు జిల్లాలకు వెళ్లి రైతుల ఇబ్బందులు తీర్చాలని సూచించారు. 

ఉచిత బియ్యం, యూరియా అంతా కేంద్రానిదే 

దేశంలో 83 కోట్ల మందికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ ప్రభుత్వం.. ప్రతి కేజీపై రూ.40 ఖర్చు చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీలోనూ 60 శాతం వాటా కేంద్రానిదేననీ, ఇది కాదని సీఎం రేవంత్  చెప్పగలరా? అని ప్రశ్నించారు. పత్తి పంటను కూడా క్వింటాలుకు రూ.8660 మద్దతు ధరతో కేంద్రమే నేరుగా కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు. రైతులకు రూ2,500 విలువైన యూరియా బస్తాను కేవలం రూ.242కే అందిస్తూ కేంద్రం అండగా నిలుస్తోందన్నారు. 

వ్యాట్ తగ్గించకుండా విమర్శలా?

పెట్రోల్, డీజిల్  ధరలపై రేవంత్ రెడ్డి మాటలు అప్రజాస్వామికంగా ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఇంధనంపై అత్యధికంగా పన్నులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, లీటరు పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తోందన్నారు. కేంద్రం ఎక్సైజ్  డ్యూటీని తగ్గించినప్పుడు, వ్యాట్ తగ్గించని రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు.