మే నెలాఖరు కల్లా కొమురవెల్లి స్టేషన్ ప్రారంభం

మే నెలాఖరు కల్లా కొమురవెల్లి స్టేషన్ ప్రారంభం
  • రాష్ట్రంలో రూ.48 వేల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణలో రూ.48 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేకు రూ.5,454 కోట్ల బడ్జెట్​తో 3 హైస్పీడ్ బుల్లెట్ ట్రెయిన్​లను కేటాయించిందన్నారు. శనివారం హైదరాబాద్​లోని ఉప్పుగూడ, మలక్ పేట అమృత్ రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు.

2014–15 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు కేంద్రం రూ.1000 కోట్లు కేటాయించగా, 2026–-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. నూతన లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, బైపాస్ లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, స్టేషన్ల పునరాభివృద్ధికి రూ.48 వేల కోట్లతో ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.  గత 12 ఏండ్లలో తెలంగాణలో 347 కిలో మీటర్ల మేర నూతన రైలు మార్గాలు, 556 కిలో మీటర్ల మేర డబ్లింగ్/ట్రిప్లింగ్ పనులను పూర్తి చేశామని వెల్లడించారు. 

కొమురవెల్లికి కొత్త రైల్వే స్టేషన్ పూర్తి..

ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణను యాదాద్రి వరకు పొడిగించడం ద్వారా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రైలు అనుసంధానం మరింత మెరుగుపడుతుందని కిషన్​రెడ్డి తెలిపారు. పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి సమీపంలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించినట్టు తెలిపారు. ఈనెలాఖరులో లేదా వచ్చే నెల మొదటివారంలో ఈ స్టేషన్​ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌‌‌‌లో 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారని, వీటిలో 3 తెలంగాణ రాష్ట్రానికే కేటాయించినట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 5 వందే భారత్ రైళ్లు, 6 అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో రైల్వే కనెక్టివిటీ చేపడతామన్నారు. తెలంగాణలోనే 40 స్టేషన్లను రూ.2,000 కోట్లతో పునరాభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు.