కృష్ణా బోర్డు సమావేశం వాయిదా..మే 21కి రీ షెడ్యూల్

కృష్ణా బోర్డు సమావేశం వాయిదా..మే 21కి రీ షెడ్యూల్
  • ఏపీ విజ్ఞప్తితో నిర్ణయం మార్చుకున్న బోర్డు!

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 14న (గురువారం) జరగాల్సిన 21వ బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని అధికారులు ఈ నెల 21కి రీషెడ్యూల్ చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ..14వ తేదీన బోర్డు సమావేశం నిర్వహించాలని రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు.

అయితే, దీనికంటే ముందుగా నీటి విడుదలపై చర్చించేందుకు ఈ నెల 12న త్రిసభ్య కమిటీ (త్రీ మెంబర్ కమిటీ) సమావేశం నిర్వహించాలని ఏపీ కోరగా, బోర్డు సమావేశంలోనే దీనిపై చర్చిద్దామని తెలంగాణ ప్రతిపాదించింది. కానీ, తెలంగాణ విజ్ఞప్తిని కాదని ఏపీ కోరిన తేదీనే బోర్డు ఖరారు చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో తాగునీటి అవసరాల నిమిత్తం ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 18 టీఎంసీల నీటిని కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఈ కేటాయింపులకు సంబంధించిన అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు కూడా చేశారు. త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసి, నీటి కేటాయింపులు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికి బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ కోరినట్లు తెలుస్తోంది. స్పందించిన కృష్ణా బోర్డు, సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, గత సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక అంశాలను ప్రస్తావించినప్పుడు.. వాటిపై బోర్డు పూర్తి స్థాయి సమావేశంలోనే చర్చిద్దామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ సమావేశం వాయిదా పడటంతో ఆయా అంశాలపై నిర్ణయం వెలువడటంలో మరికొంత జాప్యం జరగనుంది.

సాగర్, శ్రీశైలంలో కనీస మట్టాన్ని నిర్వహించాలినాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నిల్వను దాటి నీళ్లను వాడుకోరాదని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపింది. గురువారం రెండు రాష్ట్రాలకు తాగు నీటి కోసం వాటర్ రిలీజ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బోర్డు జారీ చేసింది.

ఈ నెల 12న జరిగిన త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు 21 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. శ్రీశైలం నీటిని కేవలం తాగు నీటి అవసరాలకే వాడుకోవాలని పేర్కొంది. ఏపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుదుత్పత్తికి నీటిని తరలించరాదని సూచించింది.

నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాల  ప్రాజెక్టు సీఈలదే బాధ్యత అని స్పష్టం చేసింది. ఆగస్టు 15 వరకు నీటిని చూసి వాడుకోవాలని పేర్కొంది. శ్రీశైలంలో 810 అడుగులు, నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 510 అడుగుల దిగువన నీటిని వాడుకోవడానికి వీల్లేదని వాటర్ రిలీజ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోర్డు వెల్లడించింది.