బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి : కేటీఆర్

బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి :  కేటీఆర్
  • మున్సిపాలిటీలపై బీఆర్ఎస్​ జెండా ఎగరాలి
  • పోచారం శ్రీనివాస్​రెడ్డి రాజీనామాకు డిమాండ్​ 
  • బీఆర్ఎస్​ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్​

కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, ఎల్లారెడ్డి, వెలుగు : బీఆర్ఎస్​ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.  శనివారం బాన్సువాడ, బిచ్​కుంద, ఎల్లారెడ్డిల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఆయా చోట్ల కార్నర్​ మీటింగ్​ల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​ పార్టీ జెండా ఎగరాలన్నారు.  మున్సిపల్​ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్​కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.  బీఆర్​ఎస్​ జైత్ర యాత్ర మున్సిపల్ ఎన్నికల నుంచే ప్రారంభం కావాలన్నారు.

బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే బాన్సువాడ, జుక్కల్​, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఆ పనులను తామే చేశామని కాంగ్రెస్​వాళ్లు చెప్పుకుంటున్నారన్నారు.  10 ఏండ్ల బీఆర్ఎస్​ పాలనలో బాన్పువాడ నియోజకవర్గానికి రూ.10వేల కోట్లు ఇచ్చామన్నారు. అవసరమైతే తాము ఏమి చేశామో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామన్నారు. 

బాన్సువాడకు పోచారం శ్రీనివాస్​రెడ్డి చేసిందేమి లేదని,  ఫండ్స్ ఇచ్చింది కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ తరఫున పోచారంను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వ్యక్తి గత స్వార్థం కోసం కాంగ్రెస్ లో చేరారన్నారు. ఆయన  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. పోచారం శ్రీనివాస్​రెడ్డిని పెద్ద మనిషిగా గౌరవించి మంత్రి పదవి, స్పీకర్ పదవి కేసీఆర్ ఇచ్చారన్నారు. లక్ష్మీ పుత్రుడిగా చెప్పే వారన్నారు.   ఎల్లారెడ్డి అభివృద్ధికి రూ.10కోట్ల ఫండ్స్ ఇవ్వాలని ప్రస్తుత ఎమ్మెల్యే  ప్రపంచ బ్యాంక్​కు లేఖ రాయటం సిగ్గు చేటన్నారు.  

తమ హయాంలో జరిగిన పనులను తానే చేశానని ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. లెటర్లను ప్రొసీడింగ్ కాపీల పేరిట ఎమ్మెల్యే సంఘాల ప్రతినిధులను ఎమ్మెల్యే మోసగిస్తున్నారన్నారు.  జుక్కల్​ నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు తమ హయాంలో రూ.500 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్​ చేపట్టి పనులు మొదలు పెట్టామని,  ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను బెదిరించి పనులను ఆపివేయించారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్​, హన్మంతుషిండే,  జాజాల సురేందర్, నాయకులు  గిర్ధావర్ గంగారెడ్డి, జుబేదార్​,  తానాజీరావు తదితరులు పాల్గొన్నారు.   

పద్మాజీవాడి ఎక్స్​ రోడ్డు వద్ద కారు ఆపి..

సదాశివనగర్ :   బాన్సువాడకు కారులో వెళ్తున్న కేటీఆర్​సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి ఎక్స్​ రోడ్డు వద్ద ఆగి  కార్యకర్తలకు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు.  బీఆర్​ఎస్​ అభ్యర్థులు భారీ మోజార్టీతో గెలుస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుటలో విఫలం అయిందన్నారు.  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​, శ్రీనివాస్​ నాయక్​, పడిగెల రాజేశ్వర్​ రావు, కపిల్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.