ఊరురా గ్రామ సభలు..

ఊరురా గ్రామ సభలు..
  •     సమస్యల పరిష్కారానికే గ్రామసభలు
  •     సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు
  •     సమస్యలు పరిష్కరించాలని వినతుల వెల్లువ

నెట్​వర్క్, కరీంనగర్/ఆదిలాబాద్/ నిజామాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారానికే గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రజా పాలన- పట్టణ ప్రగతి 99 డేస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రామసభలో అడిషనల్​కలెక్టర్​అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం గ్రామాల్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక గ్రామసభలను నిర్వహిస్తోందన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామసభ, వేములవాడ టౌన్ 25వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్ గరిమా అగ్రవాల్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. విప్​మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్నారు. 

కరీంనగర్​లోని 43వ డివిజన్ లో జరిగిన వార్డుసభలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. సిటీలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. చొప్పదండి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ వడ్లూరి సరిత, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ మానస, జగిత్యాల జిల్లా కోరుట్లలో మున్సిపల్ చైర్​పర్సన్ తిరుమల వసంత ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. 

గ్రామ సభలో కంకరతో నిరసన

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా డబుల్ రోడ్డు నిర్మించడం లేదని గ్రామసభలో కంకరతో నిరసన తెలిపారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి  పోత్తూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు సాగడం లేదని మండల కేంద్రంలోని జీపీ ఆవరణలో గురువారం నిర్వహించిన గ్రామసభలో గూడూరి సురేశ్ అనే యువకుడు తట్టలో కంకర పోసుకొని సభలోకి వచ్చి నిరసన వ్యక్తం చేశాడు. 

దళిత మహిళా సర్పంచ్ పై దాడికి యత్నం

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని మేధన్ పూర్ లో జరిగిన గ్రామ సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది గ్రామ సభ ప్రారంభం కాగానే కొందరు వేదిక వద్దకు వచ్చి గొడవకు దిగారు. వేదిక పై ఉన్న దళిత మహిళ సర్పంచ్ కార్యం పద్మను బూతులు తిడుతూ బెదిరించారు. దీంతో సర్పంచ్ కుంటాల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరించి, కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.  ఇచ్చిన హామీలను ప్రభుత్వం  నెరవేరుస్తోందన్నారు. దోమకొండలో 50 బెడ్స్​హాస్పిటల్​ నిర్మిస్తున్నట్లు తెలిపారు. రామారెడ్డి మండలం రంగంపేటలో  నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్​ఆశిష్ సంగ్వాన్​పాల్గొన్నారు. 

ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని నిజామాబాద్ కలెక్టర్​ఇలా త్రిపాఠి అన్నారు. మోస్రాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి డిచ్​పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. 

నిజామాబాద్ మేయర్ ఉమారాణి బల్దియా పరిధిలోని 49వ డివిజన్ కసాబ్ గల్లిలో నిర్వహించిన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు సమస్యలు విన్నారు. ప్రజా క్షేత్రంలోనే సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తీసుకొచ్చారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో జరిగిన గ్రామ సభలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. సభ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను నోట్ చేసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

 ప్రజల సంక్షేమం కోసం చర్యలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో నిర్వహించిన గ్రామసభలకు వినతులు వెల్లువెత్తాయి. తాగు నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విన్నవించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 

జైపూర్ మండలం టేకుమట్లలో జరిగిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికకు సంబంధించి సీఎం సందేశాన్ని ఆఫీసర్లతో చదివి వినిపించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు ఫలాలు అందించేలా కృషి చేస్తోందన్నారు. ఈ నెలలో 3 నెలల రేషన్ బియ్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.