గ్లోబరీనా సంస్థపై తనపై వస్తున్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి డిఫమేషన్ నోటీస్ పంపినట్లు వెల్లడించారు. గ్లోబరీనా నా సంస్థ అని ప్రచారం చేస్తున్నారు.. మరి నాదైతే రేవంత్ సర్కార్ ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకుంది?" అని ప్రశ్నించారు. ఈ అంశంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటిస్తూ.. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్.. మనస్పూర్తిగా ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. పాత కేసుల బూజు దులుపుతారనే భయంతోనే మోదీని అనడానికి రేవంత్ భయపడుతున్నారని ఆరోపించారు. పగలు కాంగ్రెస్.. రాత్రి బీజేపీ అన్నట్లుగా రేవంత్ నడుచుకుంటున్నారని, ఢిల్లీ వెళ్తే బీజేపీ నేతల కార్లలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ బామ్మర్ది అమృత్ కాంట్రాక్టుల కుంభకోణం చేస్తున్నారని, ఢిల్లీకి మూటలు పంపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
మేము తెలంగాణ జాతికి చెందినవాళ్ళం.. బ్యాగులు మోసే, దగుల్బాజీ జాతి కాదు అని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్, ఈ-రేస్, గ్లోబరీనా.. దేనిపైనైనా కేసులు పెట్టుకోవచ్చని సవాల్ చేశారు. త్వరలోనే జిల్లాల నుంచి పాదయాత్రలు ప్రారంభించి, అన్ని వర్గాలను ఒక్కటి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరితో పెట్టుకోవద్దో వాళ్ళతోనే బీజేపీ పెట్టుకుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. దేశంలో యువతకు బీజేపీ, మోదీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ఆ పార్టీ పతనానికి ఇదే నాంది అని స్పష్టం చేశారు. ఒకప్పుడు మోదీని దేవుడన్న యువతే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు.
