- కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే రెండేండ్ల కిందటే పూర్తయ్యేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాన్ని తమ హయాంంలో చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే.. బీఆర్ఎస్ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ కు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతోనే వాటికి రూపకల్పన చేశామని తెలిపారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి శుక్రవారం టిమ్స్ హాస్పిటల్‌ను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్‌నగర్ టిమ్స్నిర్మాణాన్ని అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో 22 ఎకరాల్లో ప్రారంభించామన్నారు.
ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే 1200 కోట్ల ఖర్చుతో 300 ఐసీయూ బెడ్లతో కేసీఆర్ వాటిని తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆస్పత్రి రెండేండ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు. 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, వీఐపీ సూట్స్, కిడ్నీ వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు సహా అన్ని సౌలతులూ కల్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం వరంగల్‌లో 2 వేల పడకలతో నిర్మితమవుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా కేసీఆర్ హయాంలోనే వచ్చిందన్నారు. నిమ్స్ విస్తరణ కూడా తమ హయాంలోనే మొదలైందని పేర్కొన్నారు.
