లాఠీ దెబ్బలు తిన్నం.. కేసుల పాలైనం

లాఠీ దెబ్బలు తిన్నం.. కేసుల పాలైనం
  •     తెలంగాణ ఉద్యమంలో మా త్యాగానికి విలువేది?
  •     తొమ్మిదేండ్లుగా బీఆర్​ఎస్​ పెద్దలు, స్థానిక లీడర్లు పట్టించుకోలే
  •     తమకు జరుగుతున్న అన్యాయంపై  కేయూ విద్యార్థి ఉద్యమ నేతల ఆవేదన 
  •     హనుమకొండ ‘హరిత కాకతీయ’లో సమావేశం
  •     రెండ్రోజుల్లో కార్యాచరణ ప్రకటన

వరంగల్‍, వెలుగు:  ‘‘తెలంగాణ ఉద్యమకారులుగా ముందుండి కొట్లాడినం..  లాఠీ దెబ్బలు తిన్నం.. కేసులపాలై  జైలు జీవితాలు గడిపినం.. కోర్టుల చుట్టూ తిరిగినం..  చదువులకు దూరంగా ఉన్నం.. ఏండ్ల పాటు ఇండ్లు వదిలి త్యాగాలు చేస్తే  తొమ్మిదేండ్లుగా సర్కారు పెద్దలు పట్టించుకుంటలేరు.. విలువ ఇవ్వడం లేదు” అని  నాటి  కేయూ విద్యార్థి సంఘం నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు జరుగుతున్న అన్యాయంపై ఆదివారం హనుమకొండ  నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్​లో విద్యార్థి ఉద్యమకారులు రహస్య సమావేశం పెట్టుకున్నారు.  నాటి ఉద్యమకారులుగా.. ప్రస్తుతం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులుగా ఉన్నవారు  సైతం దీనికి హాజరై మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయంపై వారు చర్చించుకున్నారు.  తెలంగాణ రాష్ట్ర సర్కారుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు తమకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వివక్ష చూపుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు వచ్చిన పదవులు, గుర్తింపు.. కాకతీయ యూనివర్సిటీ నాయకులకు రావడంలో  ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సహకరించలేదన్నారు. విలువైన సమయం కోల్పోయినప్పటికీ  ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేకపోవడం మానసిక వేదన పడ్తున్నామని పలువురు విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్‍కు విన్నవించినా.. ఆయన దృష్టికి తీసుకుపోవడానికి జిల్లా నేతలు అడుగులు ముందుకువేయకపోవడం కలచివేస్తోందన్నారు. ఇవన్నీ చర్చించేందుకే సీక్రెట్​ మీటింగ్​ పెట్టుకున్నట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో భవిష్యత్  కార్యాచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నాటి కేయూ విద్యార్థి సంఘం నేతలు సాదు రాజేశ్​, బి.వీరేందర్, ఫిరోజ్ భాషా, చిర్ర రాజు, పాలమాకుల కొమురయ్య, జోరిక రమేశ్​, మాచర్ల శరత్, ఇ. విజయ్ కన్నా, దుర్గం సారయ్య,  కత్తెరపల్లి దామోదర్, మేడారపు సుధాకర్, సూత్రపు అనిల్, జెట్టి రాజేందర్, బొల్లె మధుకర్, లంక రాజగోపాల్, బైరపాక ప్రశాంత్, గొల్లపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.