- నిరాశతో వెనుదిరుగుతున్న సందర్శకులు
- కాంట్రాక్టర్ నుంచి పేరుకుపోయిన బకాయిలే కారణం
- త్వరలోనే మొదలుపెడతామన్న అధికారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : లుంబినీ పార్క్ లో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకునే లేజర్ షో రెండు నెలలుగా బందయ్యింది. సిటీని విజిట్చేసే సందర్శకులు చాలా మంది తప్పనిసరిగా హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని చూడడంతో పాటు లుంబినీ పార్కులో లేజర్‌షోను కూడా వీక్షిస్తారు.
వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం ఒక షో , శని, ఆదివారాల్లో రెండు షోలు వేసేవాళ్లు. కానీ, 2 నెలలుగా లేజర్‌షో నిలిచిపోవడంతో విజిటర్స్తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏకు మంచి ఆదాయ వనరుగా ఉన్న ఈ షో నిలిచిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది.
రూ.4 కోట్ల బకాయి పడ్డ కాంట్రాక్టర్
లేజర్‌షో నిర్వహించడానికి కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీ ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయకపోవడం వల్లే షో నిలిపివేసినట్టు తెలుస్తున్నది. సెక్యూరిటీ డిపాజిట్‌ను మించి..దాదాపు రూ.4 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని, అద్దె సరిగ్గా వసూలు చేయడంలో హెచ్ఎండీఏలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు సమాచారం. లేజర్షోకు ఒక్కొక్క విజిటర్నుంచి రూ.80 టికెట్ఛార్జీ తీసుకుంటున్నారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్నెలకు రూ.15 లక్షలు హెచ్ఎండీఏకు చెల్లించాల్సి ఉండగా, ప్రతి ఏడాది 10 శాతం అద్దె పెంచాల్సి ఉంటుంది.
అయితే, కాంట్రాక్టర్‌కు రూ. నెలకు రూ.30 నుంచి రూ.35 లక్షల వరకూ ఆదాయం పొందేవాడని సమాచారం. 2020లో కాంట్రాక్టు పొందిన సదరు నిర్వాహకులు మొదట్లో సరిగ్గానే చెల్లింపులు చేసినా తర్వాత అద్దె పూర్తిగా చెల్లించక కొద్ది కొద్దిగా కట్టడం, అధికారులు ఒప్పుకోవడంతో బకాయిలు పెరిగిపోయినట్టు చెప్తున్నారు.
చివరికి రూ. 4 కోట్ల వరకు చేరడంతో షోను నిలిపివేసినట్టు తెలుస్తున్నది. కేవలం లేజర్ షోకు సంబంధించిన అద్దెనే కాకుండా లుంబినీపార్క్, ఎన్టీఆర్గార్డెన్స్, సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ రోడ్‌లోని వాణిజ్య ప్రాంతాలకు సంబంధించి కూడా కాంట్రాక్టు పొందిన వారి నుంచి అద్దె వసూలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయినట్టు తెలుస్తోంది.
సంప్రదింపులు జరుపుతున్నాం
ఇటీవలే బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డిగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్‌రెడ్డి గోపిడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోగా కాంట్రాక్టర్బకాయిల విషయం తన దృష్టికి వచ్చిందని, వారి నుంచి బకాయిలు వసూలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. త్వరలోనే సందర్శకుల కోసం లేజర్‌షోను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
