- ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే పోరాటం ఉంటుంది: కవిత
- జాగృతి చీఫ్‌ను కలిసేందుకు వచ్చిన వివిధ సంఘాల నాయకులు
- అంతకుముందు జాగృతి విస్తృతస్థాయి సమావేశం
- నీళ్లు, నిధులు, నియామకాలపై అధ్యయనానికి వేర్వేరు కమిటీల ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే తన పోరాటం ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే తమకు అందరూ మద్దతివ్వాలని ఆమె కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని జాగృతి ఆఫీసులో కవితను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, ఉద్యోగ, కుల సంఘాలు, యూనివర్సిటీల విద్యార్థి నాయకులు, కార్మిక సంఘాలు, సింగరేణి నాయకులు కలిశారు. తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, అంతకుముందు జాగృతి విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాన్ని కవిత నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రోజే మండలి చైర్మన్ ఆమోదించకపోవడం, కౌన్సిల్లో కవిత ఎమోషనల్ స్పీచ్‌పై చర్చించారు.
19 ఏండ్లుగా తెలంగాణ సాంస్కృతిక వికాసం, పునరుజ్జీవం, చారిత్రక వైభవాన్ని కాపాడేందుకు, కార్మికులు, కర్షకులు, వివిధ ప్రజల సంక్షేమం కోసం సేవలందించిన తెలంగాణ జాగృతి.. భవిష్యత్తులో ఎలాంటి రూపంలో సేవలందించాలనే అంశంపైనా డిస్కస్ చేశారు. ‘‘ఉమ్మడి ఏపీలో, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏ రూపంలో జాగృతి సేవలు అవసరం అని భావిస్తున్నారు?’’ అనే అంశాలపై ప్రజాస్వామిక పద్ధతిలో అభిప్రాయాలు సేకరించాలని తీర్మానించారు.
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో 12 ఏండ్లలో ఎలాంటి పురోగతి సాధించామనే విషయాన్ని తెలుసుకోవడానికి వేర్వేరు కమిటీలను వేయాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణ స్టేట్ బడ్జెట్, ఎంప్లాయిమెంట్, ఇరిగేషన్, హెల్త్, న్యాయ, మహిళా సాధికారిత, కార్మిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ సంక్షేమం సహా వివిధ రంగాల్లో అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
ఆయా కమిటీలు ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ జరిగిన అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకొని సంపూర్ణంగా అధ్యయనం చేసి ఈ నెల 17 నాటికి స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ అధ్యక్షతన మరో ముగ్గురు సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీలో సీనియర్ జర్నలిస్టులు సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర, జాగృతి సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మిని సభ్యులుగా నియమించారు.
