ఎల్బీనగర్, వెలుగు: బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, గర్భవతిని చేసి, ఆపై బలవంతంగా గర్భస్రావం చేయించిన కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ అజీమ్ (25)కు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ. 22 వేల జరిమానా విధించింది. 2021లో బాలాపూర్లో జరిగిన ఈ ఘటనలో.. బాధితురాలిని బెదిరించి అబార్షన్ చేయించడంలో నిందితుడికి సహకరించిన అతని అన్న మహ్మద్ హలీం, తల్లి జమీలా బేగంకు కూడా మూడేండ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది.
పోలీసుల దర్యాప్తులో నిందితులు చేసిన అరాచకాలు సాక్ష్యాధారాలతో నిరూపితం కావడంతో కోర్టు ఈ శిక్షలను ఖరారు చేయడమే కాకుండా, బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
