నేపాల్లో ఇండియా కరెన్సీపై ఆంక్షల ఎత్తివేత

నేపాల్లో ఇండియా కరెన్సీపై ఆంక్షల ఎత్తివేత

ఖాట్మండు: భారత్, నేపాల్ పౌరులకు నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దాదాపు దశాబ్ద కాలంగా అమల్లో ఉన్న ఆంక్షలను తొలగిస్తూ భారత్‌కు చెందిన రూ.200, రూ.500 నోట్లను నేపాల్‌లోకి తీసుకురావడానికి, ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి అనుమతిచ్చింది. 2016లో భారత్ చేపట్టిన నోట్ల రద్దు తర్వాత నేపాల్ కేవలం రూ.100 నోట్లను మాత్రమే అనుమతించేది. తాజాగా జారీ చేసిన నోటీసు ప్రకారం.. నవంబర్ 9, 2016 తర్వాత జారీ చేసిన రూ.200, రూ.500 నోట్లను ఒక వ్యక్తి గరిష్టంగా రూ.25 వేల వరకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ నిబంధనలను సవరించింది. 

ఈ మేరకు ఫిబ్రవరి 11న ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌పై స్పష్టత ఇచ్చేందుకు బ్యాంక్ శనివారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం నేపాల్ పౌరులు కేవలం ఇండియా నుంచి మాత్రమే కరెన్సీని నేపాల్‌లోకి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది. నేపాల్ నుంచి భారత్‌కు తప్ప ఇతర దేశానికి కరెన్సీని తీసుకెళ్లకూడదని చెప్పింది. అలాగే, 2016 నవంబర్ 9 కంటే  ముందు నాటి పాత రూ.500, రూ.1000 నోట్లపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది.