ఐటీ కారిడార్‌‌కు లైట్ రైల్: ఏ రూట్‌లో అంటే?

ఐటీ కారిడార్‌‌కు లైట్ రైల్: ఏ రూట్‌లో అంటే?
  • 26 కిలోమీటర్ల మేర ఎల్ఆర్టీఎస్ నిర్మాణం
  • డీపీఆర్ సిద్ధం చేసిన అధికారులు 
  • బీఆర్టీఎస్ భారంతో పాత ప్రతిపాదనలకు బ్రేక్​

హైదరాబాద్, వెలుగు: నిర్మాణ, నిర్వహణ భారంతో ప్రతిపాదిత బీఆర్టీఎస్ నుంచి లైట్ రైల్ ట్రాన్స్ పోర్టు వైపు ప్లాన్​మళ్లింది.  కొంతకాలం కిందట ఐటీ కారిడార్ నుంచి కూకట్ పల్లి జంక్షన్ వరకు బస్సు ర్యాపిడ్ ట్రాన్స్ పోర్టు(బీఆర్టీఎస్)ను ప్రతిపాదించగా అదే రూట్​లో లైట్ రైల్ ట్రాన్సిట్(ఎల్ఆర్టీఎస్) రానుంది. కేపీహెచ్​బీ నుంచి కోకాపేట్ వరకు 26  కిలోమీటర్ల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు డీపీఆర్ రెడీ చేశారు. ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కంటే నిర్వహణ భారం తక్కువ, మెరుగైన సేవలకు అవకాశం ఉండేలా ఎల్ఆర్టీఎస్ పై అధికారులు ఇంట్రస్ట్​పెట్టారు.  ఇప్పటికే తుది ప్రతిపాదనలను ప్రభుత్వ పర్మిషన్​కు పంపారు.  హైదరాబాద్ లో మోడ్రన్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రతిపాదనల్లో భాగంగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అథారిటీ(ఉమ్టా) నివేదిక ప్రకారం మెట్రోను నిర్మించారు. అప్పటి సూచనల మేరకు బీఆర్టీఎస్, లైట్ ట్రాన్స్ పోర్టు ట్రెయిన్లపై అధికారులు స్టడీ చేశారు. 2024 జనాభాకు అనుగుణంగా  ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ తోపాటు ఎలివేటెడ్ బీఆర్టీఎస్(బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం) లేదా లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టం(ఎల్ఆర్టీఎస్ ) లను నిర్మించాలనే ప్లాన్లు చేసింది. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యంగా, కాలుష్యాన్ని నియంత్రించేలా రవాణ సౌకర్యాలను ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్ స్పీడ్​గా పెరిగిపోతుండగా మెరుగైన రవాణ సదుపాయాలపై అధికారులు ఫోకస్​ చేశారు. 

ఆధునిక ట్రాన్స్​పోర్టుతో ట్రాఫిక్​కు చెక్ 

కూకట్ పల్లి నుంచి కోకాపేట్ వరకు ప్రతి రోజూ 20 లక్షల వెహికల్స్​ తిరుగుతున్నాయనే అంచనా ఉంది. కరోనా కంటే ముందే పీక్​ అవర్స్ లో తీవ్రమైన ట్రాఫిక్ నెలకొని ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులతో ఇంధన వనరులు వినియోగం, వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువైతుంది. వీటన్నింటికి సాధారణ రవాణ కంటే ఆధునిక ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీతోనే సాధ్యమనే ప్రతిపాదనలు ఉన్నాయి. బస్సుల కంటే నిర్వహణ భారం తక్కువగా ఉండే ఆల్ట్రనేటివ్ రవాణా అవసరాలను కూకట్ పల్లి నుంచి శంషాబాద్ వరకు, ఇటు బీహెచ్ఎల్ దాటి ఓఆర్ఆర్ వరకు అందుబాటులోకి తీసుకురావాలని ఉమ్టా సూచనలు ఉన్నాయి.

హై రైజ్​ బిల్డింగులు ఎక్కువగా ఉండడంతోనే..

కమర్షియల్, రియల్ ఎస్టేట్, విద్యారంగాలకు కూకట్ పల్లి సెంటర్​గా ఉంది.  ఇక్కడి నుంచి, ఐటీ కారిడార్ మధ్య  8 కిలోమీటర్ల డిస్టెన్స్​నే ఉంటుంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా  మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హైరైజ్ భవనాలు ఎక్కువగా కూకట్ పల్లి, హైటెక్ సిటీ రూట్​లో నిర్మిస్తున్నారు. దీంతో భవిష్యత్​లో ట్రాఫిక్ చిక్కులను తప్పించాలంటే ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీకి డిమాండ్ ఉంది. దీంతో కూకట్ పల్లి నుంచి కోకాపేట్ జంక్షన్ వరకు ఏకంగా 26 కిలోమీటర్ల మేర ఆల్ట్రా మోడ్రన్ ట్రాన్స్ పోర్టేషన్ ఏర్పాటు చేయడానికి డీపీఆర్ సిద్ధం చేశారు. కూకట్ పల్లి  నుంచి ఐటీ కారిడార్ కలుపుతూ ఎల్ఆర్టీఎస్ నిర్మాణాల అవసరాన్ని గుర్తించారు. సాధ్యాసాధ్యాలపై అధికారులు ఓ దఫా స్టడీ కూడా పూర్తి చేశారు. ఈ రూట్​లో ఉన్న జంక్షన్లు, లింకు రోడ్లు, రోడ్డు బీఆర్టీఎస్ అవకాశాలను పరిశీలించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లైట్ రైల్ ఎంతో అనుకూలమని తేల్చారు.