ఫోన్ ట్యాపింగ్ కేసు : నిందితుల బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు

  ఫోన్ ట్యాపింగ్ కేసు :  నిందితుల బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్  పిటిషన్‌లను  నాంపల్లి కోర్టు  కొట్టి వేసింది.  పోలీసులు వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు వారి బెయిల్ పిటిషన్ లను  కొట్టివేసింది. రాధకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై మాత్రం ఏప్రిల్ 29 కి విచారణ వాయిదా వేసింది.   

ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండులో ఉన్న నిందితులు తమకు బెయిలు మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 24 బుధవారం కోర్టు విచారణ చేపట్టగా  పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.  ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు .. పోలీసులు వాదనతో ఏకీభవించి నిందుతుల బెయిలు పిటిషన్‌లను క్యాన్సిల్ చేసింది. 

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని చెప్పారు. త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఊహాగానాలుతో దర్యాప్తు ను ఇబ్బంది పరుస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతల ప్రమేయం పై దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ప్రభాకర్ రావు ను పట్టుకోవడం లేదనే వార్త అవాస్తవమని చెప్పారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.  దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని ట్యాపింగ్ కేసులో ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టేది లేదన్నారు.