- పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్ పార్టీకే: సీఎం రేవంత్
- బీఆర్ఎస్, బీజేపీ కలిసినా మా ఓటు శాతాన్ని చేరుకోలే
- ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది
- హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతం
- బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని జనం నమ్మలే..
- అధికారం పోయినా కేటీఆర్‌కు అహంకారం పోలే
- క్రియాశీల రాజకీయాల్లో లేని కేసీఆర్ గురించి నేను మాట్లాడ
- చివరి ఏడాదే రాజకీయాలు చేద్దాం..
- వచ్చే రెండేండ్లు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తమ రెండేండ్ల పాలనను ప్రజలు ఆశీర్వదించారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, ఈ ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధి కోసం మరింత పాటుపడుతామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
గెలిస్తే పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ కు తెలియదని అన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని, అధికారంలో ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని తెలిపారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్‌పై ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అన్నింటినీ తట్టుకొని పార్టీ నిలబడే ఉందన్నారు.
‘‘అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో నగరంలో కాంగ్రెస్ కు పెద్దగా బలంలేని జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించడం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ ఒక్కతాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగొచ్చినా మా పార్టీని ఓడించలేరని ఈ ఎన్నికతో మరోసారి రుజువైంది” అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతం..
జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్‌కు 51 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 38 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా.. ఆ రెండు పార్టీలు తమకు వచ్చిన ఓటు శాతాన్ని చేరుకోలేదని అన్నారు. ‘‘మా ప్రభుత్వ రెండేండ్ల పాలనను ప్రజలు నిశితంగా గమనించి ఈ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఎవరి పాత్ర, బాధ్యత ఏంటనేది కూడా ప్రజలు చెప్పారు.
ఈ బాధ్యతను తీసుకొని హైదరాబాద్ సిటీ అభివృద్ధికి కృషి చేస్తం. ఇందుకు బీఆర్ఎస్, బీజేపీ కూడా కలిసి రావాలి’’ అని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని చెప్పారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మూసీ అభివృద్ధితోపాటు అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
బీఆర్ఎస్ విషం చిమ్మినా..
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఫేక్ ప్రచారాలతో ప్రభుత్వంపై విషం చిమ్మిందని, అయినా జనం వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోగా, ప్రతి సందర్భంలో అవహేళన చేస్తూ, అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. నగరంలో గంజాయి, డ్రగ్స్ విస్తరిస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను రంగంలోకి దించామని, చెరువులు, నాలాలు, కుంటలను కబ్జాల నుంచి కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
కానీ వీటన్నింటిపై బీఆర్ఎస్ పనిగట్టుకొని దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. తప్పుడు వార్తలను, పెయిడ్ ఆర్టికల్స్‌ను రాయించి, ఫేక్ సర్వేలను చేయించి సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పార్టీపై, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు.‘‘మూసీ చుట్టుపక్కల జనాలెవరూ ఆ ప్రాంతం చాలా అద్భుతంగా ఉందని అక్కడ ఉండడం లేదు.
వేరే దారి లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు. వాళ్లకు మంచి వసతి ఏర్పాటు చేసి, వాళ్ల జీవన ప్రమాణాలు పెంచేందుకు మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి నిమిషం, ప్రతిక్షణం బీఆర్ఎస్ అడ్డుతగులుతున్నది. సోషల్ మీడియాను నమ్ముకొని, దానిపైనే ఆధారపడి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు.
కిషన్‌రెడ్డి పద్ధతి మార్చుకోవాలె..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికల ద్వారా వచ్చిన ప్రకంపనలను చూసైనా తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదుల్తుంది. అంటే అది మనల్ని అప్రమత్తం చేస్తుంది. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీజేపీకి వచ్చిన ఫలితాలు కూడా ఆ ప్రకంపనల లాంటివే. వాటితో కిషన్ రెడ్డి తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో రాష్ట్ర బీజేపీ కలిసిపోతుంది’’ అని హెచ్చరించారు.
కిషన్ రెడ్డి ఎంపీగా పోటీచేసినప్పుడు ఈ నియోజకవర్గంలో బీజేపీకి 25 వేల ఓట్లు వస్తే, ఇప్పుడు కేవలం 17 వేల ఓట్లు మాత్రమే వచ్చి ఆ పార్టీ డిపాజిట్ గల్లంతైందని, దీనిని ఆయన గుర్తించాలన్నారు. జంట నగరాల ప్రజలు మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, గోదావరి జలాలు ఇక్కడకు తీసుకురావాలని కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఫలితాల నేపథ్యంలో కిషన్‌రెడ్డి గమనించి తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు, ప్రాజెక్టుల విషయంలో సహకరించాలని కోరారు.
ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి విషయంలో కిషన్‌రెడ్డి పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా, వీలైనంత మేరకు కేంద్రంలో అడుగడుగునా అడ్డు తగులుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఇతర రాష్ట్రాలు తరలించుకుపోకుండా చూడాలని కోరారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుందని, మిగతా టైంలో ఆ జోలికి కూడా వెళ్లదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘ సచివాలయానికి రావాలని కిషన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్నా.. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో చర్చ చేద్దాం. ఇప్పటి వరకు మేం ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా ఇక్కడికి రాలేదు. ఢిల్లీలో మీటింగ్ పెట్టినా కూడా కిషన్‌రెడ్డి హాజరుకాలే. మళ్లీ డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇదే వేదిక మీద నుంచి సూచన చేస్తున్నా.
కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురుచూస్తున్న మన ప్రాజెక్టులు, మనకు రావాల్సిన నిధుల విషయంలో రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతోపాటు కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. చీఫ్ సెక్రెటరీ, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం పెట్టి నివేదిక రూపంలో వాళ్లకు ఇవ్వండి” అని అన్నారు. ఆ నివేదిక మన చేతిలో ఉంటే రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్ సభ సభ్యులు.. అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్‌లో ఆయా శాఖల కేంద్ర మంత్రులతో మాట్లాడడమే కాకుండా పెండింగ్ ప్రాజెక్టులపై విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఈలోపు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై మన ఎంపీలందరికీ అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భట్టిని రేవంత్ కోరారు. ఇందులో అధికారులు కూడా ఉంటారని చెప్పారు. ఈ నెల 17 న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉందని, అందులో లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించి, కోర్టు తీర్పును కూడా పరిగణనలోకి తీసుకొని ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతోపాటు జూబ్లీహిల్స్‌లో విజయం సాధించిన నవీన్ యాదవ్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్‌ను సీఎంతో పాటు మంత్రులు అభినందించారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ నవీన్ కృతజ్ఞతలు చెప్పారు. కాగా, ఫలితాలు వెలువడుతున్న సమయంలో సీఎం రేవంత్ ఇంట్లోనే లక్ష్మీపూజలో ఉండడం విశేషం.
కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం తగ్గలే..
కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని సీఎం రేవంత్ విమర్శించారు. ఆయన తన అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకుంటే మంచిదని సూచించారు. హరీశ్‌రావుకు అసూయ ఎక్కువని, ఆయన కూడా దాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ‘‘మీ ఇద్దరి వయసు నాకంటే చిన్నది. ఇంకా చాలా రోజులు రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు.
అధికారం అనేది వారసత్వ సంపద అసలే కాదు. మన తాతలు, ముత్తాతల సొత్తు కాదు’’ అని కేటీఆర్, హరీశ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారం విషయంలో నాది, నాకే సొంతం అనే భావనను విడనాడాలని, అధికారంలో ఎవరున్నా అభివృద్ధి విషయంలో సహకరించాలని కేటీఆర్‌కు హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేండ్ల సమయం ఉన్నదని, చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామని, ఈ రెండేండ్లు మాత్రం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ‘‘ఫేక్ న్యూస్‌ను నువ్వే సృష్టించి, దాన్ని నువ్వే చదివి, అది నిజమనే భ్రమలో ఉంటే ఎలా?” అని కేటీఆర్‌నుద్దేశించి అన్నారు.
ఇక కొన్ని మీడియా సంస్థలు వ్యాపార దృక్పథంతో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని, ఈ విషయంలో సంయమనం పాటిస్తే ఆ సంస్థలకు విశ్వసనీయత ఉంటుందని తెలిపారు. ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నా.. కొన్ని చానెళ్లు మాత్రం బీఆర్ఎస్ హవా మొదలైందనే వార్తలు వేశాయి.
ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీ విశ్వసనీయతను కోల్పోకండి’’ అని హితవు పలికారు. పక్క రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడి మీడియాపై తాము ప్రవర్తించవద్దని అనుకుంటున్నామని, అందుకే ఇప్పటికీ తాము మీడియాకు స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కుర్చీని కేటీఆర్, హరీశ్ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఈ ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారని చెప్పారు.
‘ ‘కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయనకు ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం బాగుండదు. కేసీఆర్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు మాత్రం ఆయనపై రాజకీయ విమర్శలు చేయడం తగదు’’ అని వ్యాఖ్యానించారు.
